ఘోర ప్రమాదం.. బస్సులో చెలరేగిన మంటలు.. 45 మంది టూరిస్టులు మృతి
Flaming bus crash in Bulgaria kills 45 North Macedonian tourists.బల్గేరియా దేశంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో
By తోట వంశీ కుమార్ Published on 23 Nov 2021 12:35 PM ISTబల్గేరియా దేశంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో మంటలు చెలరేగడంతో 45 మంది సజీవదహనం అయ్యారు. మృతి చెందిన వారిలో 12 మంది చిన్నారులు ఉన్నారు. సోఫియాకు పశ్చిమాన 45 కిమీ (28 మైళ్ళు) దూరంలో ఉన్న స్ట్రుమా హైవేపై మంగళవారం తెల్లవారుజామున 2:00 గంటలకు ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాలిపోతున్న బస్సు నుంచి ఏడుగురు బయటకు దూకగా.. వారిని సోఫియాలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా.. ఈ ఘటనపై బల్గేరియా తాత్కాలిక ప్రధాన మంత్రి స్టెఫాన్ యానెవ్ తీవ్ర దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు.
అధికారులు చెబుతున్న వివరాల మేరకు.. ఉత్తర మాసిడోనియన్ ట్రావెల్ ఏజెన్సీకి చెందిన నాలుగు బస్సులు టర్కీ నుంచి సోమవారం ఆలస్యంగా బల్గేరియాలోకి ప్రవేశించాయని బల్గేరియన్ ఇన్వెస్టిగేటివ్ సర్వీస్ చీఫ్ బోరిస్లావ్ సరాఫోవ్ తెలిపారు. స్ట్రుమా హైవేపై తెల్లవారుజామున 2:00 గంటలకు ఈ ప్రమాదం జరిగిందన్నారు. అయితే.. ప్రమాదం స్పష్టత లేదన్నారు. అగ్నిప్రమాదం కారణంగా బస్సు బోల్తా పడిందా..? లేదా బస్సు బోల్తా పడిన తరువాత బస్సుకు మంటలు అంటుకున్నాయో తెలియరాలేదన్నాడు. డ్రైవర్ తప్పిదం ఏమైనా ఉందన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. బస్సులోపల చిత్రాలు చాలా భయంకరంగా ఉందన్నారు. మానవ శరీరాలు ముద్దగా ఉన్నాయన్నారు. వారిని గుర్తించడం కూడా కష్టంగా మారిందన్నారు. కాగా.. బస్సు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలను అక్కడి కొన్ని ప్రైవేటు టీవీ ఛానెల్‌లు ప్రసారం చేశాయి.