కెనడా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ వ్యాన్‌ను ట్రాలీ ఢీకొట్టింది. కాగా ఈ ఘటనలో ఐదుగురు భారతీయ విద్యార్థులు మరణించారని, మరో ఇద్దరు గాయపడి ఆసుపత్రి పాలయ్యారని భారత హైకమిషనర్ అజయ్ బిసారియా సోమవారం తెలిపారు. ఒంటారియో హైవేపై శనివారం జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరు విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ట్విట్టర్‌లో అజయ్ బిసారియా బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇండియన్ టోరంటో బృందం సహాయం కోసం బాధితుల స్నేహితులతో సంప్రదింపులు జరుపుతోంది అని కెనడాలోని భారత హైకమిషనర్ తెలిపారు.
క్వింట్ వెస్ట్ అంటారియో ప్రొవిన్షియల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరణించిన విద్యార్థులను హర్‌ప్రీత్ సింగ్, జస్పిందర్ సింగ్, కరణపాల్ సింగ్, మోహిత్ చౌహాన్, పవన్ కుమార్‌లుగా గుర్తించారు. వారు శనివారం ఉదయం హైవే 401లో ప్రయాణీకుల వ్యాన్‌లో పశ్చిమం వైపు వెళుతుండగా తెల్లవారుజామున 3:45 గంటలకు ఈ ఘోర ప్రమాదం జరిగింది. క్రాష్‌పై దర్యాప్తు కొనసాగుతోంది. కాగా ఈ ఘటనపై ఎవరిపై ఎటువంటి అభియోగాలు మోపబడలేదు.