ప్రాణాలు హ‌రించేందుకు మ‌రో వైర‌స్‌.. అప్ర‌మ‌త్తం చేస్తున్న డ‌బ్ల్యూహెచ్ఓ

Five dead in new Ebola outbreak in Guinea.ఆఫ్రికా దేశాల్లో ఎబోలా పంజా విసురుతుంది. గినియాలో ఈ వైరస్ బారిన పడిన ఇప్పటికే ఐదుగురు మరణించారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Feb 2021 11:17 AM GMT
Five dead in new Ebola outbreak in Guinea

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి కబళిస్తున్న వేళ.. మరో మహమ్మారి ముంచుకొస్తోంది. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా పంజా విసురుతుంది. గినియాలో ఈ వైరస్ బారిన పడిన ఇప్పటికే ఐదుగురు మరణించారు. భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వైరస్ మరిన్ని దేశాలకు వైరస్ విస్తరించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఆఫ్రికాలోని మరో ఆరు దేశాలను అలర్ట్ చేసింది. ప్రాణాంతక ఎబోలా వ్యాధిని తొలిసారిగా 1976లో ఆఫ్రికాలో గుర్తించారు. నాటి నుంచి పలుమార్లు ఈ వైరస్ తన ఉనికి చాటుతోంది.

ఈ వైరస్ జంతువుల నుంచే మనుషులకు వ్యాప్తి చెందింది. చింపాంజీలు, గొరిల్లాలు లేదా జింకల నుంచి ఈ వైరస్ మనుషులకు వ్యాప్తి చెంది ఉంటుందని భావిస్తున్నారు. 2013-16 మధ్య కాలంలో గినియాలో ప్రారంభమైన ఈ వైరస్‌తో పశ్చిమాఫ్రికాలో 11,300 మంది మరణించారు. ప్రధానంగా గినియా, లైబేరియా, సియర్రా లియోన్‌లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఎబోలా వైరస్‌ నిర్ధారణ కోసం రెండో రౌండ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసుల మూలాలను కనుగొనేందుకు ఆరోగ్య సిబ్బంది కృషి చేస్తున్నారు.

కాగా, గినియాలో 109 కేసులు నమోదు కాగా ఐదుగురు మరణించారు. కాంగో దేశంలోనే ఇప్పటివరకు 300 ఎబోలా కేసులను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి మార్గరెట్‌ హారిస్‌ తెలిపారు. ఆఫ్రికాలో అనేక దేశాలు ఇప్పటికే కరోనా వైరస్‌తో సతమతమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఎబోలా పంజా విసురుతుండటం అక్కడి ప్రజలకు నిద్రలేకుండా చేస్తోంది. ఎబోలాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని లైబీరియా, సయోర్రా లియోనె లాంటి దేశాలను కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఎబోలా మూలాలను తెలుసుకునేందుకు నమూనాలను పరీక్షిస్తున్నామని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.


Next Story