గాల్లో ఉన్న విమానం ఇంజిన్‌లో మంటలు

గాల్లో ఉన్న విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఆకస్మికంగా చెలరేగిన మంటలతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

By Srikanth Gundamalla  Published on  18 Aug 2023 5:45 PM IST
Flight, fire,  emergency landing, texas,

 గాల్లో ఉన్న విమానం ఇంజిన్‌లో మంటలు 

గాల్లో ఉన్న విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఆకస్మికంగా చెలరేగిన మంటలతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విమానం టేకాఫ్‌ చేసిన కాసేపటికే ఈ సంఘటన చోటుచేసుకుంది. చివరకు మంటలతోనే పైలట్‌ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సౌత్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం ఈ ప్రమాదానికి గురైంది. టెక్సాస్‌లోని విలియం పి హామీ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ తీసుకుంది విమానం. అది మెక్సికోలోని కాంకస్‌ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టుకు వెళ్లాల్సి ఉంది. కానీ.. టేకాఫ్‌ అయిన కాసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజిన్ పాడై అందులో నుంచి మంటలు వచ్చాయి. గాల్లోకి ఎగిరాక ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో ప్రయాణికులు భాయందోళన చెందారు. ఇక తమ పని అయిపోయిందని అనుకున్నారు. మంటలు విమానం మొత్తం వ్యాపిస్తే తమ పరిస్థితి ఏంటని అనుకున్నారు.

అయితే.. వెంటనే స్పందించిన పైలట్‌ ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం అందించాడు. టేకాఫ్‌ తీసుకున్న 30 నిమిషాల వ్యవధిలోనే ఫ్లైట్‌ తిరిగి మళ్లీ టెక్సాస్‌లోని విలియం పి హామీ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్‌ అయ్యింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని.. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మాట్లాడిన ప్రయాణికులు ముందు తమకు ఏదో పేలిన శబ్ధం వినిపించిందనీ.. ఆ తర్వాత ఇంధనం వాసన వచ్చిందని చెప్పారు. కాసేపటికే మంటలను చూశామని.. దాంతో ఎంతో భయపడిపోయామని అన్నారు. కాగా. మెకానికల్ సమస్య రావడంతో ఈ పరిస్థితి తలెత్తిందని సదురు విమానయానసంస్థ ప్రకటించింది. చివరకు ఆ విమానంలో వెళ్లాల్సిన ప్రయాణికులకు మరో ఫ్లైట్‌ ఏర్పాటు చేశామని తెలిపారు.

Next Story