డచ్‌ తీరంలో భారీ నౌకలో అగ్నిప్రమాదం, 3వేల కార్లు దగ్ధం

డచ్‌ తీరంలో భారీ నౌకలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగి నౌకలో ఉన్న దాదాపు 3వేల కార్లు మంటలకు ఆహుతి అయ్యాయి.

By Srikanth Gundamalla  Published on  27 July 2023 4:24 AM GMT
Fire Accident, ship, 3000 Cars Burn, One dead,

డచ్‌ తీరంలో భారీ నౌకలో అగ్నిప్రమాదం, 3వేల కార్లు దగ్ధం

డచ్‌ తీరంలో భారీ నౌకలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగి నౌకలో ఉన్న దాదాపు 3వేల కార్లు మంటలకు ఆహుతి అయ్యాయి. కార్లతో జర్మనీ నుంచి ఈజిప్ట్‌కు బయల్దేరిన నౌకలో ఈ ప్రమాదం సంభవించింది. కాగా.. ఈ ఘటనలో ఒకరు చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. మరికొందరికి గాయాలు అయ్యాయి.

ఫ్రెమాంటల్‌ హైవే నౌక 199 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ భారీ నౌక దాదాపు 3వేల కార్లతో జర్మనీ నుంచి ఈజిప్ట్‌కు బయల్దేరింది. డచ్‌ తీరంలో ఉండగా షిప్‌లో భారీగా మంటలు వ్యాపించాయి. మంగళవారం ప్రమాదం చోటుచేసుకుంది. అయితే.. మంటలు వ్యాపించగానే అదుపు చేసేందుకు షిప్‌లో ఉన్న సిబ్బంది తీవ్రంగా ప్రయత్నం చేశారు. కానీ.. అవి ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో.. ప్రాణాలు కాపాడుకునేందుకు సముద్రంలో దూకేశారు. కాగా.. నౌకలోని ఎలక్ట్రిక్‌ కార్ల వల్లే అగ్నిప్రమాదం సంభవించిందని నౌక యజమాని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నౌక నుంచి భారీగా పొగ వెలువుడుతోంది. మంటలు కూడా కొద్ది రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక అగ్నిప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే రెస్క్యూ షిప్‌లు రంగంలోకి దిగాయి. ప్రమాదం జరిగిన నౌక దగ్గరకు చేరుకుని వారు కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఎక్కువ నీటిని స్ప్రే చేస్తే షిప్‌ మునిగిపోయే ప్రమాదం ఉందని డచ్‌ కోస్ట్‌గార్డు చెబుతున్నారు. డెక్‌పై కాకుండా పక్కలకు మాత్రమే నీటిని స్ప్రే చేస్తున్నట్లు వివరించారు. షిప్‌ మునిగిపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

నౌకలో మంటలు ఎగిసిపడటాన్ని సిబ్బంది గమనించారు. ప్రమాదం సమయంలో షిప్‌లో ఉన్న 23 మంది మంటలను అదుపు చేసేందుకు ముందే ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. అంతకంతకు మంటలు ఎక్కువగా వ్యాపించసాగాయి. పొగ కూడా ఎక్కువగా వ్యాపించింది. ఏం కనిపించకపోవడం.. ఊపిరి కూడా తీసుకోలేకపోవడంతో వారు చేసేందేం లేక సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకోవడమే శరణ్యం అయ్యింది. సిబ్బందిని కాపాడేందుకు హెలికాప్టర్లు కూడా సాయం చేశాయి. సముద్రంలో ఉన్న వారందరినీ హెలికాప్టర్ ద్వారా తీరానికి చేర్చారు. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించారు. కాగా.. తీవ్రగాయాలు అయిన ఓ వ్యక్తి మాత్రమే చికిత్స పొందుతూ చనిపోయాడని అధికారులు తెలిపారు. మరికొందరికి గాయాలు అయ్యాయని.. చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు.


Next Story