ప్రభుత్వం హెచ్చరిక.. టీకా తీసుకోకుంటే.. ఉద్యోగం నుంచి తీసేస్తాం
Fiji To Make Covid Vaccine Compulsory.కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.
By తోట వంశీ కుమార్ Published on 9 July 2021 1:14 PM ISTకరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. నిత్యం కొత్త కొత్త మ్యుటేషన్లతో చుక్కలు చూపిస్తోంది. ఈ మహమ్మారిని కొంతమేర అయినా అడ్డుకునేందుకు టీకాలు ఒక్కటే మార్గం అని నిపుణులు చెబుతున్నారు. దీంతో చాలా దేశాలు ప్రజలకు వేగవంతంగా వ్యాక్సినేషన్‌ను అందించేందుకు కృషి చేస్తున్నాయి. అయితే.. కొందరు మాత్రం వ్యాక్సిన్ తీసుకునేందుకు ఇష్టపడడం లేదు. దీంతో వారికి ఎలాగైనా టీకా వేయించుకునేందుకు చాలా దేశాలు సామ, దాన, దండోపాయాలను ప్రయోగిస్తున్నాయి.
కొన్ని దేశాల్లో టీకాలు వేసుకుంటే బంపర్ ఆఫర్లు అంటూ ప్రజలను టీకా వేయించుకునేందుకు ప్రోత్సహిస్తున్నాయి. అయినప్పటికి కొందరు మాత్రం టీకాలు తీసుకునేందుకు ససేమీరా అంటున్నారు. ప్రజలు ఇలా చెబితే వినరు అని..ఫిజీ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. టీకాలు తీసుకోకపోతే ఉద్యోగాలు ఉండవు అని హెచ్చరించింది. ఆగస్టు 15న నాటికి ప్రభుత్వ ఉద్యోగులంతా మొదటి డోసు తీసుకోకపోతే సెలవులో వెళ్లాల్సి ఉంటుందని.. నవంబర్ 1 కల్లా రెండో డోసు తీసుకోకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించింది.
ఇక ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఆగస్టు 1 కల్లా తొలి డోసు వేయించుకోవాలని సూచించింది. లేకపోతే పెద్ద మొత్తంలో జరిమానా విధించనున్నట్లు పేర్కొంది. టీకా తీసుకోకపోతే.. ఉద్యోగాలు ఉండవు అంటూ ఫిజి ప్రధాని ఫ్రాంక్ బైనిమారామా తీవ్ర హైచ్చరికలు జరీ చేశారు.ఫిజి దేశంలో సుమారు 9లక్షల మంది జనాభా ఉంటారు. ఇప్పటి వరకు దాదాపు 3,40,000 మంది మొదటి డోసు టీకా తీసుకున్నారు. ఆ దేశంలో ఇప్పటి వరకు 8,600 కేసులు నమోదు కాగా.. 48 మంది ప్రాణాలు కోల్పోయారు.