ఆక్సిజ‌న్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి

బంగ్లాదేశ్‌లోని చిట్ట‌గాంగ్‌లోని ఓ ఆక్సిజ‌న్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు మ‌ర‌ణించారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 March 2023 10:50 AM IST
Explosion at oxygen plant,  Chittagong

పేలుడు త‌రువాత ఆక్సిజ‌న్ ప్లాంట్ వ‌ద్ద దృశ్యం

బంగ్లాదేశ్‌ చిట్టగాంగ్‌లోని సీతాకుండ ఉపజిల్లాలోని కదమ్ రసూల్ (కేశబ్‌పూర్) ప్రాంతంలోని ఆక్సిజన్ ప్లాంట్‌లో శనివారం సాయంత్రం పెద్ద శ‌బ్ధంతో భారీ పేలుడు సంభ‌వించింది. దీంతో 6 గురు మ‌ర‌ణించ‌గా, 30 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

పేలుడు ధాటికి ప్లాంట్ చుట్టు ప‌క్క‌ల దాదాపు రెండు కిలోమీట‌ర్ల ప‌రిధి వ‌ర‌కు ఉన్న ఏరియా మొత్తం ప్ర‌భావితమైంది. ప్లాంట్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ద‌ట్టంగా పొగ‌ అలుముకుంది. స‌మాచారం అందుకున్న వెంట‌నే రెస్క్యూ బృందాలు అక్క‌డ‌కు చేరుకున్నాయి. ఆక్సిజ‌న్ ప్లాంట్‌లో ఐదుగురు చ‌నిపోగా, ఆక్సిజన్ ప్లాంట్‌కు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న కడం రసూల్ బజార్‌లో తన దుకాణంలో కూర్చున్న 65 ఏళ్ల షంషుల్ ఆలం మ‌ర‌ణించాడు.

పేలుడు తర్వాత 250-300 కిలోల బరువున్న లోహపు వస్తువు అతనిపై పడిందని, అతను అక్కడికక్కడే మరణించాడని ఆలం సోదరుడు మౌలానా ఒబైదుల్ మోస్తఫా మీడియాకు తెలిపారు.

పేలుడు సంభవించిన తర్వాత కద్మర్సుల్ ప్రాంతం నుండి పొగలు కమ్ముకోవడం చూసి ఫ్యాక్టరీకి వెళ్లినట్లు మదంబిబిర్ హాత్ నివాసి రెడ్వానుల్ హక్ చెప్పాడు. అతను కనీసం 12 మంది ఫ్యాక్టరీ కార్మికులను ప్లాంట్ నుండి రక్షించడాన్ని చూశాడు.

సమీపంలోని రెడీమేడ్ గార్మెంట్స్ ఫ్యాక్టరీకి చెందిన అద్దాలు ప‌గిలిపోయాయి. దీంతో ప‌లువురు కార్మికుల‌కు అద్దాల ముక్క‌లు గుచ్చుకున్నాయి.

కుమిరా ఫైర్ సర్వీస్ స్టేషన్ సీనియర్ అధికారి సుల్తాన్ మహమూద్ తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 4:30 గంటలకు ఆక్సిజన్ ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సీతాకుంద, కుమిర ఫైర్ సర్వీస్ నుంచి తొమ్మిది ఫైర్ టెండర్లు సమిష్టిగా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బందికి గంటకు పైగా సమయం పట్టింద‌న్నారు. అయితే.. పేలుడు గ‌ల కార‌ణాలు ఏంటో ఇంకా తెలియ‌రాలేద‌ని చెప్పారు. 30 మందికి పైగా గాయ‌ప‌డ‌గా వారిని చిట్టగాంగ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ఆసుపత్రికి త‌ర‌లించిన‌ట్లు చెప్పాడు.

Next Story