జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసు.. పోలీస్ అధికారే దోషి
George Floyd murder case,Ex-cop Derek Chauvin convicted. ఫ్లాయిడ్ మృతికి మిన్నియా పోలీస్ మాజీ అధికారి డెరెక్ చౌవిన్ కారణమని, అతనే అసలైన దోషిగా పేర్కొంటూ కోర్టు తీర్పు వెలువరించింది.
By తోట వంశీ కుమార్ Published on 21 April 2021 3:30 AM GMT
ఒక్క అమెరికానే కాదు మొత్తం ప్రపంచాన్నే కుదిపేసింది ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతి. అటువంటి కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఫ్లాయిడ్ మృతికి మిన్నియా పోలీస్ మాజీ అధికారి డెరెక్ చౌవిన్ కారణమని, అతనే అసలైన దోషిగా పేర్కొంటూ కోర్టు తీర్పు వెలువరించింది. 12 మంది సభ్యులున్న జ్యూరీ 10 గంటలపాటు నిరవధికంగా విచారించి ఈ ఘటనను సెకండ్ డిగ్రీ హత్య, థర్డ్ డిగ్రీ హత్య, నరహత్యగా పేర్కొంటూ తీర్పు వెల్లడించింది.
విచారణ సందర్భంగా కోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కోర్టు వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా ఉండేందుకు భారీఎత్తున బలగాలు మోహరించాయి. దోషిని తేల్చి చెబుతూ తీర్పు వెలువడిన అనంతరం ఆ ప్రాంతం లో అందరూ చప్పట్లు కొడుతూ తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే డెరెక్‌కు విధించబోయే శిక్షను తరువాత ప్రకటించనున్నారు. జార్జ్ హత్య జరిగిన సమయంలో డెరిక్‌తో పాటు ఉన్న మరో ముగ్గురు పోలీసులపైనా అభియోగాలు నమోదయ్యాయి. వారి విచారణ ఆగస్టు నుంచి జరగనుంది. తీర్పు వెలువడిన అనంతరం జార్జ్ కుటుంబ సభ్యులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ శ్వేతసౌధానికి పిలిచి మాట్లాడారు.
2020 మే 25న దుకాణంలో నకిలీ నోట్లు సరఫరా చేశారన్న ఆరోపణలతో జార్జ్ ఫ్లాయిడ్‌ను శ్వేతజాతి పోలీసు అధికారి డెరెక్ పట్టుకుని రోడ్డుపై పడుకోబెట్టి మెడపై మోకాలితో తొక్కిపెట్టాడు. ఈ క్రమంలో జార్జ్ తనకు ఊపిరి ఆడడం లేదంటూ ఎంత మొత్తుకున్నా డెరెక్ వినిపించుకోలేదు. దీంతో జార్జ్ అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటనపై అమెరికా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. నల్లజాతీయులపై దాడికి నిరసనగా వేలకొద్దీ ప్రజలు రోడ్లమీదకి రావడంతో పలు రాష్ట్రాలు కర్ఫ్యూ విధించాయి. ఆ సమయంలో ప్రపంచమంతా జార్జ్‌కు మద్దతుగా నిలిచింది.