ఉద్యోగుల‌కు ఎల‌న్ మ‌స్క్ వార్నింగ్‌.. ఆఫీసుకు రండి.. లేదంటే కంపెనీ వ‌దిలి వెళ్లాల్సిందే

Elon Musks ultimatum to Tesla employees Return to office or get out.క‌రోనా మ‌హ‌మ్మారి పుణ్య‌మా అని గ‌త రెండేళ్లుగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Jun 2022 7:40 AM IST
ఉద్యోగుల‌కు ఎల‌న్ మ‌స్క్ వార్నింగ్‌.. ఆఫీసుకు రండి.. లేదంటే కంపెనీ వ‌దిలి వెళ్లాల్సిందే

క‌రోనా మ‌హ‌మ్మారి పుణ్య‌మా అని గ‌త రెండేళ్లుగా చాలా రంగాల్లోని ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్(ఇంటి నుంచే ప‌ని) చేస్తున్నారు. ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోనే ఉండ‌డంతో చాలా కంపెనీలు.. ఉద్యోగులను ఆఫీస్‌కు వ‌చ్చి ప‌ని చేయాల‌ని కోరుతున్నాయి. అయితే.. ఇందుకు కొంద‌రు ఉద్యోగులు అంగీక‌రిస్తుండగా, మ‌రికొంద‌రు మాత్రం ఆఫీస్‌కు తాము రామ‌ని, ఇంటి నుంచే ప‌ని చేస్తామ‌ని కాదంటే రాజీనామా చేస్తామ‌ని బెదిరిస్తున్నారు. దీంతో ఉద్యోగుల విష‌యంలో ఏం చేయాలో పాలు పోక చాలా కంపెనీలు ఉద్యోగుల‌ను ఆఫీసుల‌కు ర‌మ్మ‌ని గ‌ట్టిగా చెప్ప‌లేక‌పోతున్నాయి.

అయితే.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఓ అడుగు ముందుకు వేశాడు. ఉద్యోగుల‌కు ఏకంగా వార్నింగ్ ఇచ్చేశాడు. ఇంటి నుంచి ప‌నిచేయ‌డం ఇక కుద‌ర‌ద‌ని, ఖ‌చ్చితంగా కార్యాల‌యానికి రావాల్సిందేన‌ని అల్టిమేటం జారీ చేశాడు. ఆఫీసుకు రాలేమంటే క‌నుక కంపెనీని విడిచిపెట్టాలని సూచించాడు. ఈ మేర‌కు ఉద్యోగుల‌కు పంపిన ఈ మెయిల్ ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశమైంది.

'ఇంటి నుంచి ప‌ని చేయ‌డం ఇక కుద‌ర‌దు. రిమోట్ వ‌ర్క్ చేయాలి అని ఎవ‌రైనా అనుకుంటే వారంలో క‌నీసం 40 గంట‌లు కార్యాల‌యంలో ఉండాల్సిందే. లేదంటే టెస్లా నుంచి వెళ్లిపోవ‌చ్చు. ఫ్యాక్ట‌రీ కార్మికుల‌కు చెప్పిన దానికంటే ఇది చాలా త‌క్కువ' అంటూ ఉద్యోగుల‌కు పంపిన ఈ మెయిల్స్‌లో మస్క్ పేర్కొన్నాడు.

మరోవైపు.. ఆఫీసుకు వచ్చి పనిచేయకుండా ఎవరికైనా మినహాయింపు ఇవ్వాల్సి వస్తే తానే నేరుగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని, అలా అనుమతించిన వాళ్లకు మాత్రమే మినహాయింపు ఉంటుందన్నాడు.

Next Story