స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ భారీ ఆఫర్ ప్రకటించారు. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు నిల్వ చేసే మెరుగైన, అత్యుత్తమ టెక్నాలజీని కనిపెడితే 100 మిలియన్ డాలర్లు ఇస్తానని ప్రకటించారు. 100 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు 730కోట్ల రూపాయలు. పరిశ్రమలు, వాహనాల వలన గాలిలో కర్బన ఉద్గారాలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఎలాగైనా కర్బన ఉద్గారాలను కట్టడి చేయాలని ప్రపంచ దేశాలు భావిస్తూ ఉన్నాయి.
ప్రపంచం లోనే అత్యంత ధనవంతుడైన స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ కూడా కర్బన ఉద్గారాలపై తనదైన శైలిలో స్పందించారు. కర్బన ఉద్గారాలను ఒకచోట నిల్వ చేసే టెక్నాలజీ కోసం ఎలాన్ మస్క్ పిలుపునిచ్చారు. "బెస్ట్ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీని కనుగొంటే నేను 100 మిలియన్ డాలర్లు డొనేట్ చేస్తా. వివరాలు వచ్చే వారం వెల్లడిస్తా" అని మస్క్ ట్వీట్లు చేశారు.
వ్యాపార నైపుణ్యంతో పాటు సామాజిక స్పృహ కూడా ఉండడంతోనే టెస్లా విద్యుత్ కార్ల తయారీని మొదలుపెట్టాడు మస్క్. దీని వెనుక ప్రగాఢమైన పర్యావరణ హితం కూడా ఉంది. తాజాగా ఆయన కర్బన ఉద్గారాల నివారణ దిశగా ఈ ప్రకటన చేశారు. కర్బన ఉద్గారాలను సమర్థంగా సంగ్రహించే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసిన వారికి 100 మిలియన్ డాలర్లు ఇస్తానని ట్వీట్ చేశారు. కర్బన సంగ్రహణం కోసం రూపొందించే అత్యుత్తమ విధానానికి తన బహుమతి లభిస్తుందని తెలిపారు.
అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ సైతం కర్బన ఉద్గారాల అంశంపై దృష్టిసారించారు. వాతావరణ మార్పులను నిరోధించేలా కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు.