పాకిస్థాన్‌లో భూకంపం.. బలూచిస్థాన్ నుంచి కరాచీ వరకు ప్రకంపనలు
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో సోమవారం 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.
By Medi Samrat
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో సోమవారం 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం రావడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. బలూచిస్థాన్‌లోని ఉతల్ నగరానికి తూర్పు-ఆగ్నేయంగా 65 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు USGS తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు పేర్కొంది. భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. కరాచీలో కూడా భూకంపం వచ్చినట్లు కొందరు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
ఇఇలావుంటే.. మయన్మార్‌లో మార్చి 28న రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఇప్పటి వరకూ కనీసం 1,700 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 4 వేల మంది గాయపడ్డారు. అయితే, శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో లెక్కేలేదు. భూకంపం సంభవించి నాలుగు రోజులు గడిచిపోవడంతో శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలు కుళ్లిపోయి.. దుర్గంధం వెదజల్లుతోంది. రోడ్లు, విమానాశ్రయాలు, వంతెనలు, భవనాలు సహా మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. థాయ్‌లాండ్ రాజధాని బ్యాకాంక్‌లో కూడా భూకంపం సంభవించింది. థాయ్‌లాండ్‌లో ఇప్పటివరకు 17 మంది చనిపోగా.. మరో 32 మంది గాయాలపాలయ్యారు. కానీ, నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటనకు సంబంధించి అక్కడ పనిచేస్తున్న 83 మంది ఆచూకీ గల్లంతయ్యింది.