జపాన్‌లో భారీ భూకంపం, తీవ్రత 6.3గా నమోదు
జపాన్‌లో గురువారం మధ్యాహ్నం భారీ భూప్రకంపనలు సంభవించాయి.
By Srikanth Gundamalla Published on 28 Dec 2023 10:28 AM GMTజపాన్‌లో భారీ భూకంపం, తీవ్రత 6.3గా నమోదు
జపాన్‌లో గురువారం మధ్యాహ్నం భారీ భూప్రకంపనలు సంభవించాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:45 గంటలకు జపాన్‌లో భూకంపం వచ్చింది. కురిల్ దీవుల్లోని భూమి ఒక్కసారిగా కంపించింది. సముద్రమట్టానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. స్వయంగా ఈ విషయం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.3గా నమోదు అయ్యిందని చెప్పారు.
అయితే.. భూకంపం వల్ల ఎలాంటి నష్టాలు జరిగాయనేది తెలియలేదు. ఆస్తినష్టం, ప్రాణనష్టంపై ఇప్పుడే వివరాలు చెప్పలేమని అధికారులు తెలిపారు. కాగా.. జపాన్‌లో గత అక్టోబర్‌లో భారీ భూకంపం సంభవించింది. అప్పుడు దక్షిణ జపాన్‌లోని తోరిషిమా ద్వీపం దగ్గర భూమి కంపించింది. ఆ సమయంలో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదు అయ్యింది. టోక్యోకు దక్షిణంగా 550 కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం కేంద్రీకృతమైందని ఆ దేశ భూకంప పరిశోధన కేంద్రం తెలిపింది.
ఇక అంతకుముందు మరోసారి 2023 జూన్‌లో కూడా భూకంపం వచ్చింది. ఉత్తర జపాన్‌లోని హక్కైడో ద్వీపంలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.2గా నమోదు అయ్యింది. రెండు భూకంపాల వల్ల ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఆస్తినష్టం గానీ జరగలేదు. అలాగే ఈ సారి సంభవించిన భూకంపంలో కూడా ఎలాంటి నష్టం జరగకుండా ఉంటే చాలని అధికారులు భావిస్తున్నారు.