మెక్సికోలో ఘోర ప్రమాదం.. 53 మంది దుర్మరణం
Dozens killed in Mexico road accident.మెక్సికో దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణాది రాష్ట్రమైన చియాపాస్‌లో
By తోట వంశీ కుమార్ Published on 10 Dec 2021 3:55 AM GMTమెక్సికో దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణాది రాష్ట్రమైన చియాపాస్‌లో వలసదారులతో వెలుతున్న ఓ ట్రక్కు రిటైనింగ్ గోడను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 53 మంది మరణించగా.. మరో 40 మందికి పైగా గాయపడినట్లు అక్కడి ప్రాసిక్యూటర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రాసిక్యూటర్ల ప్రాథమిక నివేదిక ప్రకారం.. సరైన ధృవపత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాకు వెళ్లేందుకు వారంతా ప్రయత్నించారని తెలిపారు. ట్రక్కు సామర్థ్యానికి మించి జనం అందులో ప్రయాణించడం, అతి వేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు చెప్పారు. వీరంతా ఖచ్చితంగా ఏ దేశానికి చెందిన వారు అనే వివరాలు ఇంకా తెలియరాలేదన్నారు. ప్రాణాలతో బయటపడిన కొందరు తాము గ్వాటెమాలా దేశస్థులమని వెల్లడించినట్లు తెలిపారు.
మృతుల కుటుంబాలకు రాష్ట్ర గవర్నర్ రుటిలియో ఎస్కాండన్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యసహాయం అందించాలని ఆదేశించాలని తెలిపారు. ఈ ఘోర ప్రమాదానికి ఎవరు కారణమనేది చట్టం నిర్ణయిస్తుందని.. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారని రుటిలియో చెప్పారు.
ఈ ప్రమాదంపై గ్వాటెమాలా అధ్యక్షుడు అలెజాండ్రో గియామ్మట్టే.. సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం వేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. బాధితులను స్వదేశానికి తరలించడం సహా తగిన సహాయం తాము చేస్తామన్నారు.
రక్తం కారుతున్నా పరుగులు..
ప్రమాదం జరిగిన సమయంలో ట్రక్కులో 107 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అక్కడకు చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే.. ట్రక్కులో ప్రయాణిస్తున్న వారి వద్ద సరైన ధ్రృవపత్రాలు లేవు. దీంతో కొందరు.. ఇమ్మిగ్రేషన్ ఏజెంట్స్ కు భయపడి పారిపోయారని సహాయక చర్యల్లో పాల్గొన వారిలో ఓ సిబ్బంది తెలిపారు. గాయాల కారణంగా రక్తం కారుతున్నా.. అదేది పట్టించుకోకుండా వెంటనే అక్కడి నుంచి పరుగు లంఖించుకున్నారన్నారు.