ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పేరు పొందిన భవనాలు ఉన్నాయి. అతి పొడవైన భవనాలు, అతి వెడల్పైన భవనాలు, ఇలా ఒక్కో భవనానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే భవనానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని, పొడవైన రెసిడెన్షియల్ భవనం. ఈ భవనం గాలి వీస్తే ఊగుతుంది. ఇదే దీని ప్రత్యేకత. ఇంతకీ ఈ గాలికి ఊగే భవనం ఎక్కడ ఉందో తెలుసా?
అమెరికాలోని మాన్‌హట్టన్‌లో 84 అంతస్తుల ఈ లగ్జరీ అపార్ట్‌మెంట్ ఉంది. స్టెయిన్‌వే టవర్‌గా పిలిచే ఈ అపార్ట్‌మెంట్ ఇప్పుడు చూపరులను ఆకట్టుకుంటోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని అపార్ట్‌మెంట్‌గా గుర్తింపు పొందింది. సెంట్రల్ పార్క్ టవర్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ తర్వాత ప్రపంచంలోనే అత్యంత సన్నని ఆకాశహర్మ్యం ఇది. దీని ఎత్తు 1428 అడుగులు. అన్ని ఆకాశహర్మ్యాలకు భిన్నమైన ఈ టవర్‌ను బలమైన కాంక్రీటుతో నిర్మించారు.
గట్టిగా గాలివీస్తే ఊగే ఈ భవన స్ట్రక్చరల్ ఇంజనీర్లు రోవాన్ విలియమ్స్ డేవిస్, ఇర్విన్‌లు. వీరు ఎంతో కష్టపడి ఈ భవనాన్ని నిర్మించారు. ఈ స్టెయిన్‌వే టవర్ సాధారణ గాలులకు 2 అడుగుల వరకు ఊగుతుంది. గంటకు 100 మైళ్ల వేగంతో వీచే గాలులకు ఎక్కువగా ఊగుతుంది. అయితే గాలికి బిల్డింగ్ ఊగుతున్న విషయం లోపలి వారికి తెలియకుండా దీన్ని తయారు చేశారు. అత్యంత ప్రమాదకరమైన భవనాల్లో ఇది ఒకటి. ఈ టవర్‌లోని స్టూడియో అపార్ట్‌మెంట్ ఖరీదు రూ.60 కోట్లు పైనే ఉంటుంది.