ఆ డిగ్రీ పట్టాలు చెల్లవు.. ఎందుకంటే..!
Degrees acquired during 20 years not recognized. ఆప్ఘానిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం అక్కడి విద్యా వ్యవస్థలో కఠిన
By అంజి Published on 6 Oct 2021 9:31 AM ISTఆప్ఘానిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం అక్కడి విద్యా వ్యవస్థలో కఠిన నిబంధనలు విధిస్తూ విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటోంది. ఇప్పటికే మహిళలు, పురుషులు వేరువేరుగా విద్య నేర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసిన తాలిబన్ ప్రభుత్వం ఇప్పుడు మరో నిబంధన జారీ చేసింది. ఈ నిబంధన ప్రకారం గత 20 సంవత్సరాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్థులు డిగ్రీలు చెల్లవు. గత 20 సంవత్సరాల్లో ఆప్ఘాన్‌ను పరిపాలించిన అప్రష్ ఘనీ, హమీద్ కర్జాయ్‌ల ప్రభుత్వాల్లో ఉన్నత విద్యలో డిగ్రీలు పొందిన విద్యార్థులను గుర్తించకూడదని ఆప్ఘాన్ విద్యాశాఖ మంత్రి అబ్దుల్ బాకీ హక్కానీ స్పష్టం చేశారు.. 2000 సంవత్సరం నుండి 2020వ సంవత్సరం వరకు మతపరమైన విద్యకు ప్రాముఖ్యత ఇవ్వకపోవడమే ఈ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది.
ఆప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని యూనివర్సిటీలో ప్రొఫెసర్‌లతో జరిగిన సమావేశంలో.. తాలిబన్ ఉన్నత విద్యాశాఖ మంత్రి అబ్దుల్ బాకీ హక్కానీ ఈ నిబంధనను ప్రకటించారు. గత 20 ఏళ్లలో ఉన్నత విద్యాసంస్థల నుండి పట్టభద్రులైన విద్యార్థులు డిగ్రీలు ఇక చెల్లవని ఆయన అన్నారు. ఈ సమావేశంలో హక్కానీ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త ఉపాధ్యాయులను నియమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గత 20 ఏళ్లలో డిగ్రీ పట్టాలు పొందిన వారు ప్రభుత్వ ఉద్యోగాలకు పనికిరారని.. పీహెచ్‌డీ చేసిన వారికంటే మదర్సాలో చదువుకున్నవారే ఎక్కువ విద్యావంతులుగా ఉంటున్నారని సమావేశంలో హక్కానీ అన్నట్లు తెలుస్తోంది. కాగా తాలిబన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అక్కడి విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆప్ఘాన్‌లో గత 20 ఏళ్లలో విద్యారంగంలో గణనీయమైన వృద్ధి నమోదైంది. కాగా తాలిబన్ ప్రభుత్వ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంపై నిపుణులు విచారం వ్యక్తం చేస్తున్నారు.