ఉస్మాన్ హాది మరణం.. బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్లు.. భారత హైకమిషనర్ కార్యాలయంపై రాళ్ల దాడి
ఇటీవల ఎన్నికల ప్రచారం చేస్తూ దుండగుల కాల్పుల్లో గాయపడిన భారత వ్యతిరేక బంగ్లా నేత షరీఫ్ ఉస్మాన్ హాది కన్నుమూశారు.
By - అంజి |
ఉస్మాన్ హాది మరణం.. బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్లు.. భారత హైకమిషనర్ కార్యాలయంపై రాళ్ల దాడి
ఇటీవల ఎన్నికల ప్రచారం చేస్తూ దుండగుల కాల్పుల్లో గాయపడిన భారత వ్యతిరేక బంగ్లా నేత షరీఫ్ ఉస్మాన్ హాది కన్నుమూశారు. దీంతో ఆయన మద్దతుదారులు రాజధాని ఢాకాలో నిరసన చేపట్టారు. దేశంలోని అతిపెద్ద వార్తపత్రిక ప్రోథోమ్ అలో ఆఫీసుకు నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలోనే పౌరులు ప్రశాంతంగా ఉండాలని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధిపతి మహమ్మద్ యూనస్ విజ్ఞప్తి చేశారు. నేడు జాతీయ సంతాప దినంగా ప్రకటించారు. నిందితులను వదిలిపెట్టబోమన్నారు.
రాడికల్ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది మరణం తర్వాత బంగ్లాదేశ్ అంతటా నిరసనలు చెలరేగాయి, వేలాది మంది షాబాగ్ వద్ద గుమిగూడి అధికారులు అతన్ని రక్షించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ప్రదర్శనకారులు నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ఊపారు. వారిలో చాలా మంది బహిరంగంగా భారతదేశ వ్యతిరేక, షేక్ హసీనా వ్యతిరేక స్వరంతో ఉన్నారు. అశాంతి హింసకు దారితీసింది. నిరసనకారులు డైలీ ప్రోథోమ్ అలో, డైలీ స్టార్ కార్యాలయాలను ధ్వంసం చేశారు. రాజ్‌షాహిలోని అవామీ లీగ్ కార్యాలయం కూడా తగలబెట్టబడినట్లు సమాచారం. రాజధాని దాటి నిరసనలు వ్యాపించాయి, చట్టోగ్రామ్‌లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ వద్ద రాళ్ల దాడి జరిగింది.
రాజకీయ కార్యకర్త షరీఫ్ ఉస్మాన్ హాది మరణ వార్త తెలియగానే బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ మాజీ నివాసం ఢాకాలోని ధన్మొండి 32 ప్రాంతంలో గురువారం ధ్వంసం చేయబడిందని పోలీసులు తెలిపారు.
ఉస్మాన్ హాది ఎవరంటే?
రాడికల్ ఇంక్విలాబ్ మోర్చాకు చెందిన కీలక నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ. హసీనాను ప్రధాని పదవి నుంచి దించేందుకు చేసిన ఘర్షణలకు ఆయనే నాయకత్వం వహించారు. దీంతో బంగ్లాలో హాదీ హీరో అయ్యారు. 2026 ఫిబ్రవరిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. కానీ అనూహ్యంగా ఈ నెల 12న ఢాకాలో దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. మెరుగైన చికిత్స కోసం సింగపూర్ తరలించగా నిన్న చనిపోయారు. దీంతో ఆయన మద్దతుదారులు అల్లర్లకు తెగబడ్డారు.