వెస్ట్ ఆఫ్రికాలో ప్రాణాంతక మార్‌బ‌ర్గ్ వైర‌స్.. 100 మందిలో 88 మంది చ‌నిపోయే అవ‌కాశం

Deadly Marburg virus discovered for first time in west africa.క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ఇంకా కోలుకోనేలేదు. తాజాగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Aug 2021 6:26 AM GMT
వెస్ట్ ఆఫ్రికాలో ప్రాణాంతక మార్‌బ‌ర్గ్ వైర‌స్.. 100 మందిలో 88 మంది చ‌నిపోయే అవ‌కాశం

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ఇంకా కోలుకోనేలేదు. తాజాగా మ‌రో వైర‌స్ ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెడుతోంది. అదే మార్‌బ‌ర్గ్ వైర‌స్‌. ఆఫ్రికాలోని గినియా దేశంలో ఈ వైర‌స్‌ను గుర్తించిన‌ట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఈ దేశంలో మార్‌బ‌ర్గ్ తొలి కేసు న‌మోదు అయ్యింది. ఎబోలా, కొవిడ్ ల త‌ర‌హాలోనే మార్‌బ‌ర్గ్ వైర‌స్ ప్ర‌మాద‌క‌ర‌మైంద‌ని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. ఈ వైరస్ సోకిన ప్రతి 100 మందిలో 88 మంది చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గ‌బ్బిలాల నుంచి ఈ వైర‌స్ సోకుతుందని వెల్ల‌డించింది.

మార్‌బ‌ర్గ్ వైరస్ రోసెట్టస్ గబ్బిలాలు ఉండే చోట కనిపిస్తుందని.. వాటి ఆవాసాలకు సమీపంలోకి వెళ్లే వారికి ఈ వైరస్ సోకుతుందని తెలిపింది. ఈ వైరస్ మనుషులకు సోకిన తర్వాత ఇతరులకు సులువుగా వ్యాపిస్తుందని చెప్పింది. వైరస్ బారిన పడిన వారు ఉపయోగించిన వస్తువుల ద్వారా వ్యాపించే అవకాశం ఉందంది. ఈ వైర‌స్ జాతీయ‌, ప్రాంతీయ స్థాయిలో మాత్ర‌మే విస్త‌రిస్తుంద‌ని, ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ్యాప్తి చెందే అవ‌కాశాలు లేవ‌న్న‌ది.

సియ‌ర్రా లియోన్, లిబేరియా బోర్డ‌ర్ వ‌ద్ద ఉన్న ఓ గ్రామంలో మార్‌బ‌ర్గ్ కేసు న‌మోదు అయ్యింది. తొలుత ఆ పేషెంట్‌కు మ‌లేరియా ప‌రీక్ష నిర్వ‌హించారు. కానీ ఆ త‌ర్వాత అది మార్‌బ‌ర్గ్ అని తేల్చారు. మార్‌బ‌ర్గ్ వైరస్ సోకగానే తీవ్ర జ్వరం, విపరీతమైన తలనొప్పి, చికాకు కలుగుతుంది. ఈ వైరస్ కు వ్యాక్సిన్, చికిత్స లేదు. అయితే, ఆయా లక్షణాలకు ప్రత్యేకంగా చికిత్సను అందించడం ద్వారా బాధితుడి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది. గ‌తంలో దక్షిణాఫ్రికా, కాంగో, కెన్యా, ఉగాండా, అంగోలా దేశాల్లో కూడా ఈ వైరస్ కేసులు అత్యల్పంగా నమోదయ్యాయి.

Next Story