నిన్న మొన్నటి వరకు కాస్త తగ్గుముఖం పట్టినట్లుగానే కనిపించినా కరోనా వైరస్ మళ్లీ తన పంజా విసురుతోంది. ఓవైపు డెల్టా, మరో వైపు ఒమిక్రాన్ వేరియంట్లు బ్రిటన్ దేశాన్ని అల్లాడిస్తున్నాయి. ఫలితంగా అక్కడ రోజు వారి కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. తాజాగా అక్కడ రికార్డు స్థాయిలో లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తరువాత నుంచి బ్రిటన్ దేశంలో లక్షకు పైగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
గడిచిన 24 గంటల్లో బ్రిటన్‌లో 1,06,122 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 13 వేలకు పైగానే ఉండడం గమనార్హం. ఇక యూకేలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ మొత్తం కేసుల సంఖ్య 69 వేలు దాటినట్లు అక్కడి ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఈ మహమ్మారి కారణంగా 1,47,573 మంది ప్రాణాలు కోల్పోయారు.
రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలందరూ మూడో డోస్(బూస్టర్ డోస్) తీసుకోవాలని యూకే ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. అంతేకాకుండా మరో కీలక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంది. చిన్నారులను కరోనా నుంచి రక్షించేందుకు వీలుగా 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు ఎనిమిది వారాల వ్యవధిలో రెండు డోసులు ఇవ్వనున్నారు.