ఆ వయసు చిన్నారుల్లో ఫైజర్ వ్యాక్సిన్ సమర్థవంతం..!

COVID Vaccine Is Safe Effective for Kids 5-11 Says Pfizer. 5 ఏళ్ల నుంచి 11 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న చిన్నారులను కరోనా

By అంజి  Published on  21 Sep 2021 2:46 AM GMT
ఆ వయసు చిన్నారుల్లో ఫైజర్ వ్యాక్సిన్ సమర్థవంతం..!

5 ఏళ్ల నుంచి 11 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న చిన్నారులను కరోనా మహమ్మారి నుంచి రక్షించేందుకు తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ మంచి ఫలితాలను ఇచ్చిందని ఫైజర్, బయోఎన్‌టెక్‌ సంస్థలు తెలిపాయి. క్లినికల్ ట్రయల్స్‌లో వ్యాక్సిన్‌ సురక్షిత ఫలితాలను నమోదు చేసిందని ఫైజర్ ఫార్మా కంపెనీ తెలిపింది. అయితే ఈ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. కరోనా మహమ్మారిని నుంచి చిన్నారులను రక్షించేందుకు త్వరలోనే తాము తయారు చేసిన వ్యాక్సిన్‌కు అన్ని అనుమతులు లభిస్తాయని ఫైజర్ సంస్థ చైర్మన్, సీఈవో ఆల్బర్ట్ బౌర్లా ఆశాభావం వ్యక్తం చేశారు. గత రెండు నెలల నుంచి అమెరికాలోని చిన్నారుల్లో కరోనా కేసులు 240 శాతం పెరిగాయని.. ఈ పరిస్థితి వ్యాక్సిన్ అత్యవసరాన్ని తెలియజేస్తోందన్నారు. డెల్టా వేరియంట్ వైరస్‌లను సైతం ఫైజర్‌ చెక్‌పెడుతుందని అన్నారు. తాము తయారు చేసిన ఫైజర్ - బయోఎన్‌టెక్ కరోనా వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పని చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఇందుకు సంబంధించిన పూర్తి డేటాను ఆ కంపెనీ విడుదల చేసింది. క్లినికల్ ట్రయల్స్‌లో భాగం 2,268 మంది 5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు రెండు డోసుల రూపంలో వ్యాక్సిన్‌ వేశారు. వ్యాక్సిన్ వేశాక.. పిల్లల్లో యాంటీబాడీలను భారీగా ఉత్పత్తి చేసినట్లు గుర్తించామన్నారు. అయితే ఈ వ్యాక్సిన్‌ 12 ఏళ్లపైబడిన వారికి ఇచ్చే వ్యాక్సిన్‌లో కొంత మోతాదు తక్కువ చేసి పిల్లలకు ఇచ్చారు. వ్యాక్సిన్‌ ప్రతిభావంతగా పని చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే క్లినికల్ ట్రయల్స్ డేటాను అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, యూరోపియన్ మెడిసిన్స్ ఎజెన్సీతో పంచుకోనున్నట్లు ఫైజర్ సీఈవో తెలిపారు. అలాగే 2 నుంచి 5 ఏళ్లు, 6 నెలల నుంచి 2 ఏళ్ల చిన్నారుల కోసం కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయని, ఈ ఏడాది చివరికల్లా ఫలితాలు వచ్చే అవకాశముందని ఫైజర్ కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

Next Story
Share it