హిమాలయాలను తాకిన కరోనా

Corona touching the Himalayas.కొండలు, లోయలు, కనుచూపుమేరా కనీ కనపడని పచ్చదనం, చల్లని ప్రశాంత వాతావరణం..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 April 2021 3:12 AM GMT
హిమాలయాలను తాకిన కరోనా

కొండలు, లోయలు, కనుచూపుమేరా కనీ కనపడని పచ్చదనం, చల్లని ప్రశాంత వాతావరణం.. ఒక్కో అడుగూ పైకి వెళ్తుంటే వెండికొండల్లా తళుకులీనే తెల్లని మంచుకొండలు. ఉదయ సాయంత్రాల్లో ఎర్రని సూర్యకిరణాలు సోకినపుడు ఆ కొండలే బంగారు రంగులో మెరిసిపోతుంటాయి. అప్పుడో, ఇప్పుడో.. ఎప్పుడో ఒకసారి, మరీ ఉత్సాహ వంతులు మాత్రమే ఈ శిఖరాలు అధిరోహిస్తారు.. ఎందుకంటే ఈ మంచుకొనడాలమీదకి ఎక్కడం అందరికీ సాధ్యం కాదు. అయితే ఇప్పుడు ప్రపంచంలో అతి ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని తాకింది కరోనా.

తాజాగా ఎవరెస్టును అధిరోహించిన నార్వే వాసికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. అతడిని ఎర్లెండ్ నెస్ గా గుర్తించారు. నెస్‌కు ఈ వైరస్ ఎలా సోకిందో తెలీదుగానీ ఖుంబు లోయలో టీ తాగడం కోసం ఆగినప్పుడు ఆ దుకాణాల దగ్గరే సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. పాజిటివ్ సోకినట్టు తెలియగానే ఇతడిని ఖాట్మండులోని ఆసుపత్రికి తరలించారు. 8 రోజుల ఐసొలేషన్ తరువాత మళ్ళీ టెస్ట్ జరపగా నెగెటివ్ రిపోర్టు వచ్చినట్టు తెలుస్తోంది.

ఎర్లెండ్ నెస్ ప్రస్తుతం నేపాల్ లో ఓ కుటుంబంలో గెస్ట్ గా ఉంటున్నాడు. అయితే ఈ సంఘటన వల్ల ప్రస్తుతం బేస్ క్యాంపులో ఉన్న వందలాది గైడ్లు, పర్వతారోహకుల ఆరోగ్యం కూడా ఇబ్బందులలో పడింది. వీరందరికీ తక్షణమే టెస్టులు నిర్వహించాలని, వారిని ఐసొలేట్ చేయాలని, టీమ్ లమధ్య కాంటాక్ట్ ఉండరాదని స్థానిక గైడ్ లు సైతం చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఎవరెస్ట్ బేస్ క్యాంపులో ఎలాంటి యాక్టివ్ కేసులు లేవని, కోవిడ్ కేసుల గురించి సమాచారమేదీ తమవద్ద లేదని కేవలం న్యుమోనియా, ఆల్టిట్యుడ్ సిక్ నెస్ కేసుల గురించిన సమాచారమే తమకు తెలిసిందని మౌంటెయినీరింగ్ డిపార్ట్ మెంట్ చెబుతోంది.

గత ఏడాది పాండమిక్ కారణంగా పర్వతారోహణను ప్రభుత్వం అనుమతించలేదు. కానీ ఈ ఏడాది ఈ శిఖరాన్ని ఎక్కేందుకు వివిధ దేశాల నుంచి మొదటిసారిగా టూరిస్టులు వచ్చారు. నేపాల్ లో వసంత కాలం అంటే మార్చి-మే నెలల మధ్య వాతావరణం బాగుంటుంది గనుక పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పర్వతారోహకులు ఇక్కడికి చేరుతుంటారు.ఎవరెస్ట్ శిఖరాన్నిఅధిరోహించేందుకు 72 గంటల లోపల కోవిడ్ టెస్ట్ చేయించుకుని నెగటివ్ రిపోర్ట్ చూపిస్తేనే నేపాల్‌లోకి అనుమతిస్తారు. ఇప్పుడు ఎవరెస్టు ను అధిరోహించే వ్యక్తికీ పాజిటివ్ రావటం నేపాల్‌కు పెద్ద దెబ్బే. ఎందుకంటే ఎవరెస్ట్ యాత్రల వల్ల ఆ దేశానికి 4 మిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తుందని అంచనా.


Next Story