ఒకప్పుటి బంగారు రాజ్యం.. నేడు ఆకలి రాజ్యమైంది.. ఎందుకిలా..!
Cooking gas cylinder cost high in Srilanka.రావణుడు ఏలిన బంగారు శ్రీలంకలో నేటి పరిస్థితులు ఆగమ్య గోచరంగా మారాయి.
By అంజి Published on 12 Oct 2021 8:52 AM IST
రావణుడు ఏలిన బంగారు శ్రీలంకలో నేటి పరిస్థితులు ఆగమ్య గోచరంగా మారాయి. ఆహార, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిటాడుతోంది శ్రీలంక దేశం. అన్నం కోసం అరిగోస పడుతున్నారు అక్కడి ప్రజలు. అటు ఆర్థిక సంక్షోభం.. ఇటు కరోనా సంక్షోభం రెండు కలిసి ఒక్కసారి మీదకు రావడంతో శ్రీలంక ప్రభుత్వం ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటోంది. విదేశీ మారక ద్రవ్యం పతనం కావడంతో... ఆ దేశంలోని నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. అయితే వస్తువుల ధరల పెరుగుదలపై అక్కడి ప్రభుత్వం కూడా ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. గత రెండు రోజుల్లో వంటగ్యాస్ సిలిండర్ ధర 90 శాతానికి పెరిగి రూ.2,657కు చేరుకుంది. ఇక లీటరు పాల ధర రూ.1,195కు పెరిగింది. కిలో పప్పు రూ.300, కిలో చక్కర రూ.230లకు పెరిగింది. (ధరలు శ్రీలంక రూపీల్లో.. గమనించండి). దీంతో ధరలను తగ్గించాలంటూ అక్కడి ప్రజలు రోడ్డెక్కుతున్నారు. గడిచిన సంవత్సర కాలంగా శ్రీలంకలో ఆహార, ఆర్థిక సంక్షోభాలు ఉన్నప్పటికి.. పరిస్థితి మాత్రం ఇంత దిగజారిపోలేదు. ప్రభుత్వం కొన్ని ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలతో విదేశీ మారక ద్రవ్యం భారీగా పతనం అయ్యింది.
మరో వైపు కొవిడ్ కారణంగా టూరిజంపై విపరీత ప్రభావం పడింది. ఇతర దేశాలకు ఎగుమతులు దెబ్బతిన్నాయి. ఉన్న కొద్ది విదేశీ మారక నిల్వలను కాపాడుకునే ప్రయత్నంలో దిగుమతులపై నిషేధం విధించింది. దీంతో వస్తువుల డిమాండ్‌కు, సరఫరాకు భారీగా అంతరం ఏర్పడింది. దీంతో ధరలు ఆకాశన్నంటాయి. ధరలు పెరుగుదల గమనించిన ప్రభుత్వం.. వెంటనే ధరలపై నియంత్రణ విధిస్తూ నిబంధనలు తీసుకొచ్చింది. దీంతో అక్రమ నిల్వలు పెరిగిపోయాయి. మార్కెట్‌లో సరఫరా తగ్గి ఆహార కొరత ఏర్పడింది. అక్రమ నిల్వలను బయటకు తీసుకువస్తే... సరఫరా పెరిగి ఆహార సంక్షోభం నుండి గట్టెక్కవచ్చనుకున్న శ్రీలంక ప్రభుత్వం వెంటనే ధరలపై ఉన్న నియంత్రణ ఎత్తివేయాలని నిర్ణయించింది. దీంతో ఇప్పటికే ఉన్న పెరిగిన ధరలు.. ఈసారి అక్కడి సామాన్య ప్రజలకు అందకుండా కొండెక్కి కూర్చున్నాయి. ఇప్పుడున్న పరిస్థితి నుంచి బయట పడాలంటే ప్రధానంగా దిగుమతులను తగ్గించుకొని... ఎగుమతులపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అలాగే పర్యాటక రంగంపై స్పెషల్ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ దేశ జీడీపీలో 101 శాతం అప్పులున్నాయంటే... అక్కడి పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. శ్రీలంకకు 2,900 కోట్ల డాలర్ల అప్పులు ఉన్నాయి. అప్పులు తీర్చడానికి దేశంలోని సంపదను ఉపయోగించాల్సిందేనని ఎకానమీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.