గబ్బిలాల్లో కొత్త కరోనా.. గుర్తించిన చైనా పరిశోధకులు
Chinese scientists find new batch of coronaviruses in bats.దాదాపు ఏడాదిన్నరగా ప్రపంచాన్నికరోనా మహమ్మారి వేదిస్తోంది
By తోట వంశీ కుమార్ Published on 13 Jun 2021 11:18 AM ISTదాదాపు ఏడాదిన్నరగా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వేదిస్తోంది. అయితే.. ఇప్పటి వరకు ఈ వైరస్ మూలలనే గుర్తించలేకపోయారు. కానీ..తాజాగా చైనా పరిశోధకులు గబ్బిలాలలో కొత్త కరోనా వైరస్‌లు కనుగొన్నారు. గబ్బిలాలలో కొత్తగా కనిపించిన వైరస్‌లు COVID-19 వైరస్ రెండూ జన్యుపరంగా ఒకేలా ఉన్నట్లుగా గుర్తించారు. నైరుతి చైనాలో వీటిని కనుగొన్నారు. గబ్బిలాల్లో ఇంకా గుర్తించని వైరస్‌లు, వాటిలో మనుషులకు వ్యాపించే అవకాశంఉన్న రకాలపై ఓ అంచనాకు రావడానికి తమ పరిశోధన ఎంతగానో ఉపయోగపడుతుందని వారు అంటున్నారు.
చైనాలోని షాండాంగ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు.. గబ్బిలాలకు చెందిన 283 మలం నమూనాలు, 109 నోటి స్వాబ్‌లు, 19 మూత్ర నమూనాలు సేకరించారు. 2019 మే నుంచి 2020 నవంబర్ మధ్య కాలంలో వీటిని సేకరించి పరిశోధనలు జరిపారు. వీటి ఫలితాలను సెల్ అనే జర్నల్‌లో ప్రచురించారు. షాడాంగ్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్లు ఫలితాల గురించి చెబుతూ.. వివిధ గబ్బిలాల జాతుల నుంచి మొత్తం 24 కొత్త కరోనా వైరస్ జీనోమ్‌లను గుర్తించినట్లు చెప్పారు.
వీటిలో సార్స్-కోవ్-2 తరహా కరోనా వైరస్‌లు నాలుగు ఉన్నాయన్నారు. ఒకదానికి మాత్రం కరోనా వైరస్‌తో చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని తెలిపారు. స్పైక్ ప్రొటీన్‌లోని జన్యుపరమైన వైరుధ్యాలు మినహా మిగతా అంశాలన్నీ ఒకేలా ఉన్నాయని చెప్పారు. థాయ్‌లాండ్‌లోనూ గతేడాది జూన్‌లో గబ్బిలాల్లో ఇలాంటి వైరస్‌ను గుర్తించారు. ఆ లెక్కన ప్రపంచవ్యాప్తంగా ఉన్న గబ్బిలాల్లో కరోనాలాంటి వైరస్‌లు భారీగా సర్క్యులేట్ అవుతున్నట్లు వాళ్లు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మరింత ఎక్కువ స్థాయిలో ఇవి ఉన్నట్లు తెలిపారు.