చైనాలో విషాదం, జిమ్‌ పైకప్పు కూలి 11 మంది దుర్మరణం

చైనాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ స్కూల్‌ జిమ్‌ పైకప్పు ఉన్నట్లుండి కూలిపోయింది.

By Srikanth Gundamalla  Published on  24 July 2023 4:41 AM GMT
China,  11 People Died, Gym roof Collapse,

 చైనాలో విషాదం, జిమ్‌ పైకప్పు కూలి 11 మంది దుర్మరణం

చైనాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ స్కూల్‌ జిమ్‌ పైకప్పు ఉన్నట్లుండి కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు శిథిలాల కిందే చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది. వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే.. ప్రమాదానికి నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది.

ఈశాన్య చైనాలోని హెలాంగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లోని క్విక్విహార్‌లో ఆదివారం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో జిమ్‌లో దాదాపు 19 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో నలుగురు పైకప్పు కూలగానే అదృష్టవశాత్తు బయటపడగిలిగారు. మరో 11 మంది మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారంతా శిథిలాల కిందే ఉండిపోయారు. వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మృతుల్లో చాలా మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. శిథిలాల చిక్కుకున్న వారు కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటారని.. అధికారులు భావిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. స్కూల్‌ నిర్మాణానికి ఉపయోగించిన పైర్‌లెట్ అనే ఓ పదార్థాన్ని పనుల అనంతరం మర్చిపోయి పైకప్పు పైనే ఉంచేశారు. ఇటీవల చైనాలో భారీ వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా పైకప్పుపై నిలిచిన నీరు మొత్తాన్ని పీల్చుకుని బరువు పెరిగిపోయింది. దాంతో పైకప్పు నీటి బరువుని మోయలేక ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో.. నిర్లక్ష్యంగా వ్యహరించినందుకు ఒక వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు.

చైనాలో ఇలాంటి ఘటనలో గతంలోనూ చోటుచేసుకున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు. గత నెలలో ఓ రెస్టారెంట్‌లో పేలుడు సంభవించి 31 మంది మృతిచెందారు. అంతకుముందు బొగ్గు గనిలో సంభవించిన ప్రమాదంలో ఏకంగా 53 మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరి నిర్లక్ష్యం కారణంగా జనాల ప్రాణాలు పోవడంపై అక్కడి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది కూడా. అయినా మరోసారి ఇలాంటి ప్రమాదమే చోటుచేసుకోవడం కలవరపెడుతోంది.


Next Story