గతేడాది జూన్‌లో లడాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఓ ఉన్నతాధికారికి తీవ్ర గాయాలయ్యాయని చైనా అధికారికంగా వెల్లడించింది. కాగా.. ఈ ఘటనలో ఎంత మంది చైనా సైనికులు చనిపోయారనే విషయాన్ని వాస్తవంగా చైనా వెల్లడించడం లేదని ఆదేశానికే చెందిన పలువురు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చైనాలోని ఓ పాపులర్ బ్లాగర్ అయిన కియు జిమింగ్ సైతం ఇదే విషయాన్ని చెప్పాడు
గాల్వన్ ఘర్షణలో ఎక్కువ మంది సైనికులు మరణించారని, ప్రభుత్వం మాత్రం నలుగురే అని చెబుతోందని.. ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. దీంతో అతడిని వెంటనే అదుపులోకి తీసుకుని నేర చట్టాల కింద అభియోగాలు మోపింది. ట్విట్టర్ లాంటి వీబో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో అతనికి 25 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. విబో వేదికపై నెటీజన్లను ఆకరించి ఫాలోవర్లను పెంచుకునేందుకే ఇలా చేసినట్లు అతడు చెప్పాడని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వాస్తవాలను వక్రీకరించి సైనికులను అవమానించినట్లు ఒప్పుకున్నాడన్నారు.
దీంతో విబో అతడి ఖాతాను ఏడాది పాటు బ్యాన్ చేసింది. మంగళవారం నాన్‌జింగ్ నగరంలోని కోర్టు.. అతనికి 8 నెలల జైలు శిక్షను విధించింది. జాతీయ హీరోలు, అమరవీరులను కించపరిస్తే వారికి జైలు శిక్షను అమలు చేసే కొత్త నేర చట్టానికి ఇటీవలే చైనా ఆమోదం తెలిపింది. ఆ చట్టం ప్రకారం శిక్ష పడిన మొదటి వ్యక్తి ఇతనే. ఫిబ్రవరి నుంచి గాల్వన్ ఘటనపై అనుచిత కామెంట్లు చేసిన ఆరుగురిని ఇప్పటి వరకు చైనా అరెస్టు చేసింది.