యుద్ధక్షేత్రంలో చాద్ దేశ అధ్యక్షుడు మృతి

Chad President Idriss Deby dies.చాద్ దేశాధినేత ఇద్రిస్ దెబీ తిరుగుబాటుదారులతో జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 April 2021 1:36 AM GMT
Chad President Idriss Deby

మధ్య ఆఫ్రికా చిరు దేశం చాద్ అధ్యక్షుడ్ని కోల్పోయింది. చాద్ దేశాధినేత ఇద్రిస్ దెబీ తిరుగుబాటుదారులతో జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. చాద్ లో మూడు దశాబ్దాల పాటు సాగిన ఇద్రిస్ దెబీ పాలన ముగిసిపోయింది. స్వయంగా తుపాకీ చేతపట్టి తిరుగు బాటుదారులపై యుద్ధ రంగంలో దిగిన అధ్యక్షుడు తీవ్ర గాయాలతో కన్నుమూశారని చాద్ సైన్యం వెల్లడించింది.

ఇద్రిస్ దెబీ మరణం నేపథ్యంలో ఆయన కుమారుడు మహామత్ ఇద్రిస్ దెబీ ఇత్నో నేతృత్వంలో మధ్యంతర పాలన మండలి ఏర్పాటవుతుందని, 18 నెలల పాటు ఈ మండలి దేశ పాలన వ్యవహారాలు చేపడుతుందని సైన్యం తెలిపింది. రాజకీయ అధికారం సాఫీగా బదలాయింపు జరగడానికి ఈ మండలి తోడ్పడుతుందని వివరించింది.

ఇటీవలే చాద్ లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో ఇద్రిస్ దెబీ ఓటు కూడా వేశారు. ఈ ఎన్నికల్లో ఇద్రిస్ దెబీ విజయం సాధించారంటూ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఆయన యుద్ధరంగంలో మరణించడం చాద్ దేశాన్నే కాకుండా, ఇతర ఆఫ్రికా దేశాలను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్‌గా పని చేసిన ఇడ్రిస్ 1990లో సైనిక తిరుగుబాటు ద్వారా అప్పటి ఆ దేశాధ్యక్షుడు హిస్సెన్నే హేబ్రేను పదవీచ్యుతుడిని చేసి అధికారం చేపట్టారు.దెబీ పదవి నుంచి దిగిపోవాలని 2016 నుంచి తిరుగుబాటుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల తరచుగా ప్రభుత్వ వర్గాలకు, తిరుగుబాటుదారులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.

దేశాధ్యక్షుడే మరణించినా... సైన్యం మాత్రం అంతర్యుద్ధంలో తామే గెలిచామని చెప్పుకుంటుండగా, గాయాలపాలైన అధ్యక్షుడు యుద్ధరంగం నుంచి తీవ్రగాయాలతో పారిపోయి మరణించాడని తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు. దేశంలో 14 రోజులు సంతాపదినాలుగా పాటించాలని సైన్యం ఆదేశించింది.
Next Story