గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నట్లు అనే సామెత ఇతడికి సరిగ్గా సరిపోతుంది. చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా అతడి జేబు ఖాళీ అయింది. సరదాగా సిగరెట్ తాగి ఆ పీకను రోడ్డుపై పడేశాడు. అధికారులు దాన్ని గమనించి జరిమానా విధించగా అతడు దాన్ని పట్టించుకోలేదు. దీంతో అధికారులు అతడిని కోర్టుకు లాగారు. కోర్టు అతడికి రూ.55వేల జరిమానా విధించింది. ఈ ఘటన లండన్‌లో చోటు చేసుకుంది.
ఇంగ్లాండ్‌లోని థోర్న్ బరీ టౌన్‌లో అలెక్స్ డేవిస్ అనే వ్యక్తి సిగరేట్ దాని పీకను చెత్త బుట్టలో వేయకుండా రోడ్డుపై పడేశాడు. దీన్ని స్ట్రీట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గమనించారు. అధికారులు అతడికి రూ.15వేలు(150 పౌండ్లు) జరిమానా విధించారు. దీన్ని కట్టాలని అతడికి అధికారులు సూచించారు. అయితే.. డేవిస్ ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. అక్కడి నుంచి జారుకున్నాడు.
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అలెక్స్‌కు రూ.55వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. సిగరెట్‌ను తాగి పీకలను ఎక్కడపడితే అక్కడ పడవేస్తే రోడ్లన్నీ చెత్తాచెదారంగా తయారు అవుతాయని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.