కరోనా మరణమృదంగం.. ఒక్క రోజే 4వేల మంది మృతి
Brazil Tops 4000 COVID-19 Deaths In A Single Day.బ్రెజిల్‌లో తొలిసారిగా కోవిడ్ మరణాల సంఖ్య 24 గం.ల వ్యవధిలో 4,000లను దాటింది.
By తోట వంశీ కుమార్
బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. ఆ దేశంలో తొలిసారిగా కోవిడ్ మరణాల సంఖ్య 24 గం.ల వ్యవధిలో 4,000లను దాటింది. బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక కోవిడ్ బులెటిన్ మేరకు మంగళవారం ఆ దేశంలో 4,195 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో కోవిడ్ బారినపడి ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 3లక్షలు దాటింది. 24 గం.ల వ్యవధిలో 4 వేలకు పైగా కోవిడ్ మరణాలు నమోదైన మూడో దేశం బ్రెజిల్. ఇప్పటి వరకు అమెరికా, పెరూలో మాత్రమే 4 వేలకు పైగా కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.
బ్రెజిల్‌లో అత్యధిక జనాభా నివసిస్తున్న సావో పాలో రాష్ట్రంలో ఆ దేశంలోనే అత్యధికంగా 1,400 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. కరోనా మరణాల సంఖ్య పెరగడంతో కొన్ని శ్మశాన వాటికల వద్ద రాత్రిపూట కూడా ఖననం చేసేందుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతివ్వడం తెలిసిందే. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలినా, రోగులతో నిండిన ఆసుపత్రుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నా.. చాలా మంది గవర్నర్లు, మేయర్లు, జడ్జిలు ఆర్థిక వ్యవస్థలో కొన్ని కార్యకలాపాలను పునరుద్ధరిస్తున్నారు. దీంతో బ్రెజిల్‌లో ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదే పరిస్థితి కొనసాగితే ఏప్రిల్ చివరి నాటికి ఆ దేశంలో రోజువారీ కోవిడ్ మరణాల సంఖ్య 5,000లకు చేరే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచే కరోనా కట్టడికి బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో తగిన చర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి. ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఎట్టకేలకు దేశంలో కరోనా తీవ్రతను బోల్సోనారో అంగీకరించారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటామన్నారు..