సాధారణంగా కామెర్లు వస్తే కళ్లు పచ్చగా మారుతాయి అన్న సంగతి తెలిసిందే. అయితే.. కెనడాకు చెందిన ఓ 12 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారి నాలుక పసుపు పచ్చ రంగులోకి మారింది. అంతేకాదు.. మూత్రం ఎర్రగా వస్తోంది. కడుపు నొప్పి వచ్చింది. దీంతో భయపడిన అతడి తల్లిదండ్రులు వెంటనే ఆ చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ బాలుడికి పలు రకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలుడు అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించారు.
బాలుడికి రక్తహీనత ఉందని, ఎప్సీన్ బార్ వైరస్ బారిన పడినట్లు వైద్యులు గుర్తించారు. దాంతో పాటు మంచి చేసే ఎర్ర రక్తకణాలను చంపేసే 'కోల్డ్ అగ్లుటినిన్' అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉన్నట్టు తేల్చారు. శీతల వాతావరణం వల్ల ఈ జబ్బు వస్తుందని చెబుతున్న వైద్యులు.. ఈ బాలుడి విషయంలో మాత్రం ఎప్ స్టైన్ బార్ వైరస్ వల్లే వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోల్డ్ అగ్లుటినిన్ వల్ల రక్తహీనత వస్తుందని, ఎర్ర రక్తకణాలు దెబ్బ తింటాయని చెప్పారు.
బాలుడికి చికిత్సలో రక్త మార్పిడి, రోగనిరోధక వ్యవస్థ కార్యకలాపాలను తగ్గించడానికి ఏడు వారాల పాటు స్టెరాయిడ్లను ఉపయోగించారు. దీంతో బాలుడు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. నాలుక రంగు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుందని జర్నల్ ఆఫ్ మెడిసిన్ తన నివేదికలో పేర్కొంది.