ర‌ద్దీగా ఉన్న మార్కెట్‌లో బాంబు పేలుడు.. 35 మంది మృతి

Bomb blast kills at least 35 people in Baghdad.ఇరాక్ రాజ‌ధాని బాగ్దాద్‌లో బాంబు పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 July 2021 10:21 AM IST
ర‌ద్దీగా ఉన్న మార్కెట్‌లో బాంబు పేలుడు.. 35 మంది మృతి

ఇరాక్ రాజ‌ధాని బాగ్దాద్‌లో బాంబు పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో 35 మంది మృతి చెందగా.. 60 మంది వ‌ర‌కు గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రుల‌కు త‌రలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈద్ ల‌క్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు భారీ కుట్ర‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఆ ప్రాంత మొత్తం చెల్లా చెదురుగా పడి ఉన్న మృత‌దేహాలు, ర‌క్త‌పు ముద్ద‌ల‌తో భీకరంగా క‌నిపిస్తోంది.

సదర్ నగరంలోని వహైలాట్ మార్కెట్ల్‌లో సోమవారం బాంబు దాడి జరిగింది. బక్రీద్‌ (ఈద్‌ అల్‌-అధా) పండుగకు పెద్ద ఎత్తున జనం మార్కెట్లకు రాగా అదును చూసి ఉగ్రవాదులు బాంబు పేల్చారు. అప్పటి వరకు కొనుగోలుదారులతో సందడిగా ఉన్న దుకాణాలు ముందు.. మృతుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోగా.. ఎటు చూసినా రక్తపు మరకలు.. బాధితుల రోధనలు మిన్నంటాయి. ఈ ఘటనలో 35 మంది వ‌ర‌కు మృతి చెంద‌గా.. 60 మంది వరకు గాయపడ్డారని, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. పేలుడు ధాటికి కొన్ని దుకాణాలు కాలిబూడిదయ్యాయి.

స్థానికంగా తయారు చేసిన ఐఈడీతోనే ఉగ్రవాద దాడి జరిగిందని ఇరాక్‌ అంతర్గత వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దాడి ఘటనపై ఇరాక్‌ అధ్యక్షుడు బర్హామ్‌ సలీమ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. ఇరాక్‌లో ఇదో విచారకరమైన రోజన్నారు. కాగా.. పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు ప్రకటించలేదు.

Next Story