నేడు అంత‌రిక్షంలోకి అమెజాన్ వ్య‌వ‌స్థాప‌కుడు

Blue Origin's first human spaceflight on Tuesday.అంతరిక్ష పర్యాటక రంగంలో మరో కీలక అడుగు పడనున్నది. అమెజాన్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 July 2021 9:49 AM IST
నేడు అంత‌రిక్షంలోకి అమెజాన్ వ్య‌వ‌స్థాప‌కుడు

అంతరిక్ష పర్యాటక రంగంలో మరో కీలక అడుగు పడనున్నది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్ మంగ‌ళ‌వారం అంత‌రిక్ష‌యానం చేయ‌నున్నారు. ఆయ‌న‌తో పాటు మ‌రో ముగ్గురు వెళ్ల‌నున్నారు. అందులో ఒకరు బెజోస్‌ సోదరుడు మార్క్‌. మరో ఇద్దరు.. అత్యంత ఎక్కువ వయస్సులో అంతరిక్ష యాత్ర చేయనున్న మాజీ పైలట్‌ వాలీ ఫంక్‌(82) కాగా, మరొకరు అంతరిక్ష యానం చేయనున్న అతి పిన్న వయస్కుడు ఆలివర్‌ డెమెన్‌(18). డెమెన్‌ రూ.209 కోట్లతో ఈ యాత్రలో సీటు సంపాదించుకొన్నారు. 20 ఏళ్ల క్రితం బెజోస్ ప్రారంభించిన 'బ్లూ ఆరిజిన్‌' సంస్థకు చెందిన తొలి స్పేస్‌క్రాఫ్ట్‌ 'న్యూ షెపర్డ్‌' బెజోస్‌తో పాటు నలుగురిని భూమి నుంచి వంద కిలోమీటర్ల దూరంలోకి కార్మన్‌ లైన్‌ దాటి అవతలకు తీసుకువెళ్తుంది. సరిగ్గా 10 నిమిషాల తరువాత తిరిగి వారిని భూమిపైకి తీసుకుని వస్తుంది. రోద‌సి ప‌ర్యాట‌కాన్ని ప్రోత్స‌హించే దిశగా ఈ యాత్ర సాగ‌తుంది.

వర్జిన్‌ గెలాక్టిక్‌ అధిపతి రిచర్డ్‌ బ్రాన్సన్‌, భారత సంతతికి చెందిన బండ్ల శిరీష ఇటీవల అంతరిక్ష యాత్రను పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే. నిజానికి రోద‌సియానం చేసే ఉద్దేశం తొలుత ఆయ‌నకు లేదు. బెజోస్ త‌న యాత్ర గురించి ప్ర‌క‌ట‌న చేయ‌గానే బ్రాన్స‌న్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. వ్యాపార ప్ర‌త్య‌ర్థి క‌న్నా ముందే ఈ నెల 11న యాత్ర చేప‌ట్టారు. త‌ద్వారా స్వీయ వ్యోమ‌నౌక‌లో రోద‌సిలోకి వెళ్లొచ్చిన తొలి బిలియ‌నీరుగా ఆయ‌న గుర్తింపు పొందారు. ఈ నేప‌థ్యంలో బెజోస్ యాత్ర నిర్వ‌హిస్తున్నారు.

స్పేస్‌ క్రాఫ్ట్‌ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు నింగిలోకి స్పేస్ క్రాఫ్ట్ దూసుకుని వెళ్లనుంది. స్పేస్‌క్రాఫ్ట్‌ 'న్యూ షెఫర్డ్‌' ప్రయాణానికి సిద్ధంగా ఉందని బ్లూ ఆరిజిన్‌ సంస్థ అస్ట్రోనాట్‌ సేల్స్‌ డైరెక్టర్‌ ఆరియన్‌ కార్నెల్‌ వెల్లడించారు. 1961లో అంతరిక్షానికి వెళ్లిన తొలి అమెరికన్‌ అలాన్‌ షెఫర్డ్‌ పేరును బ్లూ ఆరిజిన్‌ సంస్థ ఫస్ట్ స్పేస్‌క్రాఫ్ట్‌కు పెట్టింది. స్పేస్‌ ఎక్స్‌ సంస్థకు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ తరహాలో స్పేస్ క్రాఫ్ట్‌ను తయారుచేశారు. ఇది అటానమస్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌. దీనిలో పైలట్‌ ఉండరు. దానికదే నడుస్తుంది. న్యూ షెపర్డ్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌లో మనుషులు ప్రయాణించడం ఇదే తొలిసారి. గతంలో ట్రయల్స్‌ నిర్వహించినప్పటికీ అందులో మనుషులు ప్రయాణించలేదు.

Next Story