మాల్దీవ్స్‌లో కలకలం..దేశ అధ్యక్షుడు మొయిజ్జుపై చేతబడి!
అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జుపై చేతబడి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 28 Jun 2024 7:03 AM ISTమాల్దీవ్స్‌లో కలకలం..దేశ అధ్యక్షుడు మొయిజ్జుపై చేతబడి!
కొంతకాలం నుంచి మాల్దీవ్స్ దేశం నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తోంది. భారత్‌పై విమర్శలు.. ఆ తర్వాత ఆ దేశం ఎదుర్కొన్న పరిస్థితులతో పాటు ఇతర అంశాలు వార్తల్లో కనిపిస్తూ వచ్చాయి. తాజాగా మాల్దీవ్స్‌లో ఆ వార్త సంచలనంగా మారింది. ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జుపై చేతబడి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. దీని వెనుక ఇద్దరు మంత్రుల ప్రమేయం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. దాంతో.. పోలీసులు వారు ఇద్దరిని అరెస్ట్ కూడా చేశారంటూ స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో పర్యావరణ శాఖ సహాయ మంత్రి షమ్నాజ్ సలీం, ఆమె మాజీ భర్త, అధ్యక్ష కార్యాలయ మంత్రి రమీజ్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. దీనిపై ఇప్పటి వరకు పోలీసులు కూడా అధికారిక ప్రకటన వెలువరించలేదు.
షమ్నాజ్ సలీంతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.. వీరికి ఏడురోజుల కస్టడీ కూడా విధించారని వార్తలు వచ్చాయి. అలాగే షమ్నాజ్ సలీం, ఆమె భర్తను కూడా మంత్రి పదవి నుంచి తొలగించారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మాల్దీవ్స్ అధ్యక్షుడిగా ఉన్న మొయిజ్జు గతంలో మాలె నగర మేయర్‌గా ఉన్నారు. అప్పుడు షమ్నాజ్, రమీజ్‌లు కౌన్సిలర్లుగా పనిచేశారు. ముఖ్య అనుచరుల్లో ఒకరుగా రమీజ్ ఉన్నారు. అలాంటి వ్యక్తిచేతబడి చేయించినట్లు వస్తున్న వార్తలు మాల్దీవ్స్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. కాగా.. ఈ పరిణామాలపై మాల్దీవ్స్ ప్రభుత్వం కూడా ప్రకటన చేయలేదు. గత ఐదు నెలల నుంచి ఆయన బయట ప్రపంచంలోకి రాలేదు.
కాగా.. మాల్దీవుల్లో చేతబడి చేయడాన్ని నేరం కింద పరిగణించరు. కానీ.. ఇస్లామిక్ చట్టాల ప్రకారం దోషిగా నిర్దారణ అయితే ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు. మరోవైపు మాల్దీవుల పర్యావరణ ముప్పు పొంచి ఉందనీ.. ఈ శతాబ్దం నాటికి దీవులు మునిగిపోతాయంటు పలువురు నిపుణులు చెబుతున్నారు. షమ్నాజ్ అదే శాఖకు మంత్రిగా ఉన్నారు. అయితే, మొయిజ్జును అంతం చేయడానికే చేతబడి ప్రయోగించినట్టు ఆరోపణలు వస్తున్నాయి.