అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు సంబంధించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మైక్రోసాఫ్ట్ సంస్థలో పనిచేసే ఒక మహిళా ఉద్యోగితో ఉన్న వివాహేతర సంబంధం వల్లే ఆయన బోర్డు నుంచి వైదొలిగాల్సి వచ్చిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. సంఘటన జరిగి చాలా ఏళ్లు గడచినప్పటికి బిల్ గేట్స్, మిలిందా ల విడాకుల నేపథ్యంలో ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి బిల్‌గేట్స్ గత ఏడాది మార్చి 13వ తేదీన వైదొలిగారు. ఇకపై తన పూర్తి జీవితం సామాజిక సేవకే వినియోగించాలనుకుంటున్నానని, అందువల్లే మైక్రోసాఫ్ట్ బోర్డుకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చెప్పినట్టుగానే అప్పటి నుంచి ఆయన గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలతో మరింత బిజీగా మారిపోయారు.
అయితే, వాల్‌స్ట్రీట్ జర్నల్ తాజా కథనం వేరేగా ఉంది. దీని ప్రకారం బిల్‌గేట్స్ మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే ఒక మహిళా ఇంజనీర్‌తో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని, మీటూ ఉద్యమం సమయంలో ఈ విషయాన్ని ఆ మహిళ 2019లో స్వయంగా బోర్డుకు లేఖ రాయడంతో వెలుగులోకి వచ్చిందని చెబుతోంది . దీనిని తీవ్రంగా పరిగణించిన బోర్డు.. చట్టబద్ధంగా ఆయనపై విచారణ జరిపించింది. విచారణ జరిగినంత కాలం బాధితురాలికి పూర్తి అండగా నిలబడినట్టుగా తెలుస్తోంది. ఈ ఆరోపణలపై దర్యాప్తు పూర్తికావడానికి ముందే బిల్‌గేట్స్ రాజీనామా చేశారని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
అయితే ఉద్యోగితో ఉన్న సంబంధానికి, బోర్డు నుంచి వైదొలగడానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు బిల్ గేట్స్ సన్నిహితులలో ఒకరు. 20 ఏళ్ల క్రితం ఆమెతో సంబంధాలు ఉండేవని, చివరకు అది స్నేహపూర్వక వాతావరణంలోనే అది ముగిసిందన్నారు. ఈ వ్యవహారానికి, బోర్డు నుంచి వైదొలగడానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కాగా భార్య మిలిందా గేట్స్‌తో 27 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ బిల్ గేట్స్ ఇటీవల విడాకుల విషయం వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే బిల్‌గేట్స్-మెలిండా ల విడాకులు తీసుకోవడానికి ఇది ఓ కారణమై ఉండకపోవచ్చని వాల్ స్ట్రీట్ జర్నల్ అంచనా వేసినట్లు పేర్కొంది.