జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన తొలి చిత్రం ఇదే
Biden unveils first image of webb telescope. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన తొలి చిత్రాలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా రిలీజ్ చేసింది.
By అంజి Published on 12 July 2022 11:03 AM ISTజేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన తొలి చిత్రాలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా రిలీజ్ చేసింది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఈ ఫొటోలను సోమవారం ఆవిష్కరించారు. శ్వేతభవనంలో జరిగిన ప్రివ్యూ ఈవెంట్‌లో నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ సమక్షంలో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఫస్ట్ ఇమేజ్‌ను విడుదల చేశారు. ఈ వెబ్ టెలిస్కోప్ తీసిన ఫస్ట్ ఫొటో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన చారిత్రాత్మక క్షణాలను సూచిస్తుందని బైడెన్ పేర్కొన్నారు. కాగా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఫొటోలను నాసా, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కలిసి ఇవాళ విడుదల చేయనున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఓ ఫొటో ప్రివ్యూ చూశారు. ఈ ఫొటోను విడుదల చేసిన బైడెన్ ఇది హిస్టారిక్ డే అని అన్నారు.
నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ మాట్లాడుతూ..'' వెబ్ టెలిస్కోప్ నుంచి విడుదలైన ఫస్ట్ ఫొటో ఇదే. ఇప్పుడు మనం 13 బిలియన్ సంవత్సరాలు వెనక్కి వెళ్లి చూస్తున్నాం. ఈ ఫొటోలో మీరు చూస్తున్న కాంతి 1300 కోట్ల సంవత్సరాలుగా ప్రయాణిస్తూనే ఉంది. విశ్వానికి సంబంధించి ఇప్పటివరకు మానవాళి చూడని అతి సుదూరమైన ఇన్ఫ్రారెడ్ చిత్రం ఇది. ఈ టెలిస్కోప్ మరెన్నో రహస్యాలను చేధించాల్సి ఉంది'' అని పేర్కొన్నారు.
జేమ్స్ టెలిస్కోప్ బంధించిన ఈ చిత్రంలో చాలా నక్షత్రాలు ఉండగా ముందువైపు భారీ గెలాక్సీలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద శక్తివంతమైన అంతరిక్ష టెలిస్కోప్‌గా జేమ్స్ వెబ్ స్పేస్ రికార్డు సృష్టించింది. దీనిని 2021 డిసెంబర్‌లో ఫ్రెంచ్ గయానా నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించారు.
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన ఫొటోలను నాసా వెబ్‌సైట్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు నెల్సన్ పేర్కొన్నారు. కారినా నెబ్యులా, WASP-96b, సదరన్ రింగ్ నెబ్యులా, స్టీఫన్స్ క్వింటెట్‌కు సంబంధించిన ఫొటోలను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. కారినా నెబ్యులా భూమికి 7600 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. 2014లో గుర్తించిన WASP-96b భూమికి 1,150 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.