బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింస.. రైలుకు నిప్పు, ఐదుగురు మృతి

బంగ్లాదేశ్‌లో ఎన్నికల రెండ్రోజుల ముందే హింస చెలరేగింది

By Srikanth Gundamalla  Published on  6 Jan 2024 8:05 AM IST
bangladesh, train, fire, five died,

బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింస.. రైలుకు నిప్పు, ఐదుగురు మృతి

బంగ్లాదేశ్‌లో ఎన్నికల రెండ్రోజుల ముందే హింస చెలరేగింది. ప్యాసింజర్‌ రైలుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దాంతో.. ఈ ఘటనలో రైలు బోగీలకు మంటలు పెద్ద ఎత్తున అంటుకున్నాయి. మంటల్లో చిక్కుకుని ఐదుగురు చనిపోగా.. మరికొందరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. బెనాపోల్‌ ఎక్స్‌ప్రెస్‌లోని నాలుగు కోచ్‌లు మంటల్లో కాలి బూడిద అయ్యాయి. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలోని గోపీబాగ్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి 9.05 గంటల సమయంలో దుండగులు ట్రైన్‌కు నిప్పు పెట్టిన సంఘటన చోటుచేసుకుంది.

కాగా.. బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు మరో ఒక్కరోజు సమయమే ఉంది. జనవరి 7న బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో దుండగులు రైలుకు నిప్పు పెట్టిన సంఘటన కలకలం రేపుతోంది. అయితే. ఇంతకు ముందు కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఇలాంటి చర్యకే పాల్పడ్డారు. బంగ్లాదేశ్‌ ఫైర్ బ్రిగేడ్ బృందం రైలు కాలిపోయిన కోచ్‌ల నుంచి ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. అయితే.. ట్రైన్‌కు మంటలు అంటుకున్న విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రాత్రి 9.35 గంటలకు ఘటనాస్థలానికి వెళ్లారు. వెంటనే మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే.. ఫైర్ సిబ్బంది వెళ్లే సరికి పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. దాంతో.. వాటిని అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. రాత్రి 11.30 గంటల సమయానికి మంటలను అదుపు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక రైలు ఢాకా వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. మంటల్లో చనిపోయిన ఐదుగురి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయనీ.. దాంతో గుర్తింపు కష్టంగా మారిందని అధికారులు అంటున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్‌ పార్టీ అధికారంలో ఉంది. ఇక బంగ్లాదేశ్‌లో నేషనలిస్ట్‌ పార్టీ బీఎన్పీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతోంది. అయితే.. ఈ ఎన్నికలను బీఎన్పీ పూర్తిగా బహిష్కరించింది. బంగ్లాదేశ్‌లో 300 సీట్లు ఉండగా.. గత ఎన్నికల్లో అవామీ లీగ్ 290 స్థానాలను గెలుచుకుంది.


Next Story