ఘోర అగ్నిప్రమాదం.. 43 మంది సజీవదహనం

బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on  1 March 2024 7:30 AM IST
bangladesh, fire accident, 43 people died ,

ఘోర అగ్నిప్రమాదం.. 43 మంది సజీవదహనం 

బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఆ దేశ రాజధాని ఢాకాలోని ఏడు అంతస్తుల రెస్టారెంట్‌లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ సంఘటనలో ఇప్పటి వరకు 43 మంది సజీవదహనం అయ్యారు. వేగంగా పై అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయనీ.. దాంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ మంటల్లో చిక్కుకుని మరో 40 మంది వరకు గాయాలపాలయ్యారు. ఇక అగ్నిప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. దాదాపు 75 మందిని సురక్షితంగా కాపాడారు. అయితే.. రెస్టారెంట్‌లోని గ్యాస్‌ సిలిండర్‌ పేలడం వల్లే ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.

ఢాకాలోని బెయిలీ రోడ్డులో ఓ బిర్యానీ రెస్టారెంట్‌లో గురువారం రాత్రి అగ్నిప్రమాదం సంభివించిందని అగ్నిమాపక అధికారులు చెప్పారు. మంటలు కింద ఫ్లోర్ నుంచి పై బిల్డింగ్‌కు వేగంగా వ్యాపించాయి. వేగంగా విస్తరించడంతో అందులో ఉన్న వారు బయటకు రావడానికి వీలులేకుండా పోయిందన్నారు. ఈ సంఘటన జరిగిన ప్రాంతంలో రెస్టారెంట్లు, వస్త్ర దుకాణాలు, మొబైల్‌ ఫోన్ల షాపులు ఉన్నాయని చెప్పారు. అయితే.. మంటలను త్వరగానే ఆపేయడం ద్వారా పక్కన ఉన్న వాటికి వ్యాపించలేదని చెప్పారు. కానీ.. దురదృష్టవశాత్తు రెస్టారెంట్‌లో 43 మంది చనిపోయినట్లు తెలిపారు.

ఇక ఇదే సంఘటన నుంచి బయటపడ్డ బాధితులు మాట్లాడుతూ.. తాము ఆరో అంతస్తులో ఉన్నట్లు చెప్పారు. మెట్ల మార్గం నుంచి పొగ రావడం గమనించామన్నారు. అందరూ కింద నుంచి పైగా పరిగెత్తుకు వచ్చారనీ తెలిపారు. కిటికీలను పగలగొట్టి.. నీటిపైపుల ద్వారా కిందకు దిగినట్లు పలువురు తెలిపారు. ఇంకొందరు మంటల నుంచి తప్పించుకునేందుకు పై అంతస్తుల నుంచి దూకండంతో వారికి గాయాలు అయ్యాయి. మరికొందరు పూర్తిగా భవనంపైకి చేరుకున్నారు. సాయం కోసం చూశారు. వారిని ఫైర్‌ సిబ్బంది రక్షించారు. కాగా.. బంగ్లాదేశ్‌లో ఇలాంటి అగ్నిప్రమాదాలు గతంలోనూ జరిగాయి. 2021 జులైలో ఓ ఆహార శుద్ధి పరిశ్రమలో చెలరేగిన మంటల్లో 52 మంది చనిపోయారు.

Next Story