కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి.. మృతుల్లో ఆరు నెలల పాప
Baby Teen Mother Among 6 Killed As Gunmen Open Fire At California Home.అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి
By తోట వంశీ కుమార్
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియాలోని ఓ ఇంటిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఆరునెలల చిన్నారితో పాటు ఆమె తల్లి కూడా ఉంది.
జోక్విన్ వ్యాలీ తులారేశాన్ పట్టణంలోని ఓ ఇంటిపై సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఇద్దరు దుండగులు అనేక సార్లు కాల్పులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇది ఏదో అనుకోకుండా జరిగిన ఘటన కాదని, పక్కా పథకం ప్రకారమే దుండగులు కాల్పులకు పాల్పడ్డారని బావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. మాదక ద్రవ్యాల ముఠాలకు ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు అనిపిస్తోందన్నారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారని చెప్పారు. ఆరు నెలల పాప, 17 ఏళ్ల ఆమె తల్లి తలపై కాల్చారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే సరికే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా.. కాల్పుల సమయంలో మరో ఇద్దరు వారికంటపడకుండా జాగ్రత్త పడటంతో ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ ఘటనపై తులారే కౌంటీ షెరీఫ్ కార్యాలయానికి చెందిన షెరీఫ్ మైక్ బౌడ్రెక్స్ మాట్లాడుతూ.. ఈ ఘటనకు పాల్పడింది మాదకద్రవ్యాల ముఠాగా తెలిపాడు. "చిన్నారితో పాటు ఆ చిన్నారి తల్లి తలపై కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే మరణించారు. ఇది యాదృచిక హింసాత్మక చర్య కాదు, పక్కా ప్లాన్ ప్రకారమే కాల్పులు జరిపారు. డ్రగ్స్ ముఠాలతో సంబంధాల నేపథ్యంలో ఈ కాల్పులు జరిగి ఉంటాయి." అని షెరీఫ్ మైక్ బౌడ్రెక్స్ అన్నారు.
సరిగ్గా వారం రోజుల ముందు ఘటన జరిగిన నివాసంలో నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు తనిఖీలు చేశారు. మాదక ద్రవ్యాలు నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో ఈ తనిఖీలు జరిగాయి.