గాజాలో ఘోరం.. ఒకే కుటుంబంలో 18 మంది మృతి

ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.

By Srikanth Gundamalla  Published on  18 Aug 2024 2:44 AM GMT
attack,  gaza, 18 people died,  same family

 గాజాలో ఘోరం.. ఒకే కుటుంబంలో 18 మంది మృతి 

ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. చర్చలంటూ ఇరువురు ముందుకు వచ్చినా.. అవి అసంపూర్తిగా ముగిశాయి. గాజాలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే.. తాజాగా గాజాపై మరోసారి భీకర దాడులు జరిగాయి. జవైదా పట్టణంపై టెల్‌ అవీవ్‌ జరిపిన వైమానికి దాడిలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. మృతులు మొత్తం ఒకే కుటుంబానికి చెందినవారు కావడం విషాదాన్ని నింపుతోంది. దాడిలో వ్యాపారి అయిన సమీ జవాద్ అల్‌-ఎజ్లా, అతడి ఇద్దరు భార్యలు, 11 మంది పిల్లలు, మరో నలుగురు బంధువులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అల్‌ అక్సా ఆస్పత్రి వెల్లడించింది. ఒకే కుటుంబంలోని 18 మంది చనిపోవడం సంచలనంగా మారింది. గాజాపై మరోసారి దాడులు జరగడం ఉద్రిక్తతకు దారి తీస్తోంది.

లెబానాన్‌లోని నెబాతీహ్‌ ప్రావిన్స్‌లో మరో దాడి జరిగింది. ఈ సంఘటనలో ఒక మహిళ, ఆమె ఇద్దరు పిల్లలతో పాటు మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. హెజ్‌ బొల్లాక చెందిన ఆయుధ నిల్వ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ ఎటాక్ జరిగిందని ఇజ్రాయెల్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. తీరప్రాంత టైర్ నగరంలో జరిపిన దాడిలో ఓ హెజ్‌బొల్లా కమాండర్‌ను హతమార్చినట్లు చెప్పారు.సెంట్రల్ గాజాలోని మాఘాజీ శరణార్థి శిబిరం, పరిసర ప్రాంతాల్లోని పాలస్తీనీయన్లు వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లాలని అధికారులు ఆదేశించారు.

ఇజ్రాయెల్, హమాస్ మధ్య చర్చలు జరిపి.. కాల్పుల విరమణ జరిగేలా యూఎస్, ఈజిప్ట్‌, ఖతార్ దేశాలు చూస్తున్నాయి. ఇరువురిని సముదాయిస్తున్నాయి. కానీ.. రెండురోజులు పాటు జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. మరోసారి వచ్చే వారం కైరోలో శాంతి ఒప్పందాలపై చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అప్పుడైనా కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందని ఆయా దేశాలు భావిస్తున్నాయి.

Next Story