విషాద‌యాత్ర‌గా మారిన విహార‌యాత్ర‌.. ప‌డ‌వ‌ల‌పై ప‌డిన భారీ కొండ చ‌రియ‌.. ఏడుగురు దుర్మ‌ర‌ణం

At least seven dead after Brazil cliff collapses on boats.బ్రెజిల్ దేశంలోని కాపిటోలియో ప్రాంతంలో గ‌ల ఫ‌ర్నాస్ స‌ర‌స్సు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jan 2022 3:28 AM GMT
విషాద‌యాత్ర‌గా మారిన విహార‌యాత్ర‌.. ప‌డ‌వ‌ల‌పై ప‌డిన భారీ కొండ చ‌రియ‌.. ఏడుగురు దుర్మ‌ర‌ణం

బ్రెజిల్ దేశంలోని కాపిటోలియో ప్రాంతంలో గ‌ల ఫ‌ర్నాస్ స‌ర‌స్సు ఓ అద్భుత‌మైన పర్యాట‌క ప్రాంతం. చుట్టూ ఎత్త‌యిన రాతి కొండ‌లు, వాటిపై ప‌చ్చ‌ని చెట్లు.. అంతెత్తు నుంచి జాలువారే జ‌ల‌పాతాలు. ఇలాంటి ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌మైన అందాల‌కు నెల‌వు. ఈ ప్ర‌కృతి సోయ‌గాలు చూసేందుకు వారాంతాల్లో ప‌ర్యాకులు పోటెత్తుతారు. ప‌డ‌వ‌పై ప్ర‌యాణీస్తూ అంద‌మైన ర‌మ‌ణీయ దృశ్యాల‌ను చూస్తూ సేద తీరుతుంటారు. అయితే.. శ‌నివారం ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ప‌డ‌వ‌ల‌పై ప్ర‌కృతి ర‌మ‌ణీయ దృశ్యాలు తిల‌కిస్తుండ‌గా.. మూడు ప‌డ‌వ‌ల‌పై ఓ భారీ కొండ‌చ‌రియ విరిగి ప‌డింది. దీంతో విహార‌యాత్ర కాస్తా విషాద‌యాత్ర‌గా మారింది.

ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏడుగురు మృతి చెంద‌గా.. 20 మంది గ‌ల్లంత‌య్యారు. మ‌రో 32 మంది వ‌ర‌కు గాయ‌ప‌డ‌గా.. వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. మినాస్ గెరైస్ ఫైర్‌ఫైటర్స్ కమాండర్ కల్నల్ ఎడ్గార్డ్ ఎస్టీవో డా సిల్వా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. స్థానిక కాల‌మానం ప్ర‌కారం శ‌నివారం మ‌ధ్యాహ్నాం కాపిటోలియో ప్రాంతంలోని ప‌ర్యాట‌క ప్రాంత‌మైన ఫ‌ర్నాస్ స‌ర‌స్సులో ప‌డ‌వ‌ల్లో విహ‌రిస్తున్న వారిపై ఓ లోయ వ‌ద్ద ఓ రాతి శ‌క‌లం విడిపోయి మూడు ప‌డ‌వ‌ల‌పై ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు మృత‌దేహాల‌ను గుర్తించాం. అంచ‌నా ప్ర‌కారం 20 మంది త‌ప్పిపోయారు. 32 మంది గాయ‌ప‌డిన‌ట్లు చెప్పారు.

కాగా.. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మిగ‌తా ప‌డ‌వ‌ల్లో ప్ర‌యాణీస్తున్న ప‌ర్యాట‌కుల వీడియోల్లో ఈ ఘ‌ట‌న రికార్డు అయిన‌ట్లు తెలుస్తోంది. మూడు ప‌డ‌వ‌ల‌పై కొండ చ‌రియ విరిగి ప‌డ‌డం అందులో చూడొచ్చు. ఆ వీడియోలో మిగతా ప‌డ‌వ‌ల్లోని ప్ర‌యాణీకులు రాళ్లు ప‌డుతున్నాయి.. చాలా రాళ్లు ప‌డుతున్నాయి అర‌వ‌డం వినిపిస్తోంది. వారిని దూరంగా వెళ్ల‌మ‌ని హెచ్చ‌రించారు.

ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న అందుకున్న రెస్క్యూ బృందాలు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నాయి. 32 మంది గాయ‌ప‌డ‌గా.. వీరిలో 9 మందిని ఆస్ప‌త్రిలో చేర్పించిన‌ట్లు తెలిపాయి. గ‌ల్లంతైన వారి కోసం గాలింపు చేప‌ట్టారు. రాత్రి కావ‌డంతో గాలింపు చ‌ర్య‌ల‌ను నిలిపివేశారు. తిరిగి ఉద‌యం మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు తెలిపారు.

Next Story