అమెరికాలో వాహనాల బీభత్సం.. 130 వాహానాలు ఒకదానికొకటి ఢీ
At least 9 killed in 130 vehicle pileup on icy Texas interstate.అమెరికాలోని టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ఒకటి కాదు రెండు కాదు సుమారు 130 వాహనాలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టాయి.
By తోట వంశీ కుమార్ Published on 12 Feb 2021 12:11 PM ISTఅమెరికాలోని టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు సుమారు 130 వాహనాలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టాయి. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 70 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో మైళ్ల కొద్ది ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. గురువారం ఉదయం టెక్సాస్ రాష్ట్రం పోర్త్ విత్ సమీపంలోని 35వ అంతరాష్ట్రీయ రహదారి(డల్లాస్-ఫోర్ట్‌వర్త్) ఈ ఘటన చోటుచేసుకుంది. ఫెడ్‌ఎక్స్ ట్రక్కు అదుపు తప్పి బారియర్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ క్రమంలో దాని వెనుకాలే వస్తున్న వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నాయి.
వాహనాలు వేగంగా ఢీకొట్టుకోవడంతో ఒకదానికిందకు మరొకటి దూసుకెళ్లాయి. దీంతో రోడ్డుపై కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఒక్కో వాహనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ అందులోని వారిని బయటకు తీసి, అవసరమైన చికిత్స అందిస్తున్నారు. దెబ్బతిన్న వాహనాలను పక్కకు తరలిస్తున్నారు. చాలా వరకు వాహనాలు నుజ్జునుజ్జయి పోయాయి. జారుడుగా ఉన్న ఆ మార్గంలో రాకపోకలు సాగించేందుకు సహాయక సిబ్బంది సైతం ఇబ్బందులు పడుతున్నారు.
తీవ్ర మంచుతుఫాను కారణంగా వాహనాలు పట్టుకోల్పోడం వల్లే ప్రమాదం జరిగిందని ఫోర్ట్‌వర్త్ పోలీస్ అధికారి డేనియల్ తెలిపారు. కాగా.. ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 70 మందికిపైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.టెక్సాస్‌లో షెర్లీ తుఫాను కారణంగా గత కొన్ని రోజులుగా విపరీతంగా మంచు కురుస్తోంది. తుఫాను వల్ల పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. రోడ్డుపై మంచు పేరుకుపోయి తరుచూ వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. తుపాను ప్రభావంతో కెంటకీ, వెస్ట్ వర్జీనియాల్లోని సుమారు 1.25 లక్షల నివాసాలు, వాణిజ్యప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.