ఇళ్ల మధ్యలో కూలిన విమానం.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం.. ప‌రుగులు తీసిన జ‌నం

At Least 2 Dead After Small Plane Crashes.ఓ చిన్న విమానం కుప్ప‌కూలి ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం చెందిన ఘ‌ట‌న అమెరికా దేశంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Oct 2021 8:15 AM IST
ఇళ్ల మధ్యలో కూలిన విమానం.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం.. ప‌రుగులు తీసిన జ‌నం

ఓ చిన్న విమానం కుప్ప‌కూలి ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం చెందిన ఘ‌ట‌న అమెరికా దేశంలో చోటుచేసుకుంది. కాలిఫోర్నియా ప‌ట్ట‌ణంలోని శాన్‌డియాగో శివారులోని శాంటీ ప్రాంతంలో సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఇళ్ల‌పై చిన్న విమానం కూలింది. ఈ ఘ‌ట‌న‌లో రెండు ఇళ్లతో పాటు ప‌లు వాహ‌నాలు ధ్వంసం కాగా.. రెండు మృత‌దేహాలను అగ్నిమాప‌క సిబ్బంది క‌నుగొన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. మ‌రొ ఇద్ద‌రు గాయ‌ప‌డిన‌ట్లు తెలిపారు. మ‌ర‌ణించిన వారిని పైలట్, యూపీఎస్ డ్రైవర్ గా గుర్తించారు.

ఫాక్స్ 5 శాన్ డియాగో ట్విన్ ఇంజిన్ సెస్నా 340 విమానం అరిజోనాలోని యుమా నుంచి బయలుదేరింది. గాల్లోకి ఎగిరిన కాసేప‌టికే ఆ విమానం శాంటీ ప్రాంతంలో కూలింది. ఆ స‌మ‌యంలో భారీగా మంట‌లు చెల‌రేగా.. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. అయితే.. అప్ప‌టికే విమానంతో పాటు ప‌లు వాహ‌నాలు పూర్తిగా ద‌గ్థం అయ్యాయి. కాగా.. విమానం కూలిపోతున్న‌ప్పుడు చూసిన ప్ర‌జ‌లు ఇళ్లలోంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. విమానం కుప్ప‌కూలిన స‌మ‌యంలో ఆ విమానంలో ఎంత మంది ప్ర‌యాణీకులు ఉన్నారు అనే వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కాగా.. విమానం కూలిన ప్రాంతం స‌మీపంలో ఓ పాఠ‌శాల ఉందని.. విద్యార్థులంతా సుర‌క్షితంగా ఉన్న‌ట్లు పాఠ‌శాల యాజ‌మాన్యం ట్వీట్ చేసింది. విమానం కూలడానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై అధికారులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. కాగా.. విమానం కాలిపోతున్న దృశ్యాల‌ను కొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌గా.. అవి వైర‌ల్‌గా మారాయి.

Next Story