ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుపుతూ ఉన్నారు. దక్షిణాఫ్రికాలో కూడా కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తుండగా.. బ్రిటన్ కు చెందిన ఆస్ట్రాజెనికా ఫార్మా సంస్థ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ పై మాత్రం అనుమానాలను వ్యక్తం చేస్తోంది. ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో పెద్దగా ప్రభావం చూపడంలేదంటూ దక్షిణాఫ్రికా చెబుతోంది. అంతేకాకుండా ఆ వ్యాక్సిన్ పంపిణీని కూడా నిలిపివేసింది. దక్షిణాఫ్రికా చేసిన ప్రకటనను బ్రిటన్ తప్పుబడుతోంది. కరోనా మరణాలను, తీవ్ర అస్వస్థతను నివారించడంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ విఫలమవుతోందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని బ్రిటన్ అంటోంది. దక్షిణాఫ్రికా ఈ వ్యాక్సిన్ పంపిణీని తాత్కాలికంగా నిలిపివేసిందని.. కొత్త కరోనా స్ట్రెయిన్ పైన కూడా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోందని బ్రిటన్ సహాయ మంత్రి ఎడ్వర్డ్ ఆర్గర్ వెల్లడించారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. భారత్ లో కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ శరవేగంగా సాగుతూ ఉంది. భారతదేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,05,34,505 మంది కోలుకున్నారు. 1,48,609 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 58,12,362 మందికి వ్యాక్సిన్ వేశారు.