ఆఫీస్‌లకు రావాలని బలవంతపెడితే రాజీనామాలు..!

Apple and Google Employees Angry Over Return To Office.క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దాదాపు 18 నెలలుగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 July 2021 10:21 AM GMT
ఆఫీస్‌లకు రావాలని బలవంతపెడితే రాజీనామాలు..!

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దాదాపు 18 నెలలుగా ఉద్యోగులు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ చేస్తున్నారు. కార‌ణాలు ఏమైన‌ప్ప‌టికి చాలా మంది ఉద్యోగులు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం విధానానికే అల‌వాటు ప‌డ్డారు. ఇటీవ‌ల క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ముమ్మ‌రం కావ‌డంతో ఆఫీసులు మ‌ళ్లీ తెరిచేందుకు కంపెనీలు ప్ర‌య‌త్నాలు ప్రారంభించాయి. ఈ మేర‌కు ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపుతున్నాయి. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ విధానానికి తాము అల‌వాటు ప‌డ్డామ‌ని..ఆపీసుకు రావ‌డం కుద‌ర‌ని ఉద్యోగులు మండిప‌డుతున్నారు. ఒకవేళ ఆఫీసుకు రావాల‌ని బ‌ల‌వంతం పెడితే.. రాజీనామా చేసేందుకు కూడా సిద్ద‌మ‌ని చెబుతున్నారు.

ఆఫీస్‌ రిటర్న్‌ పాలసీపై.. గూగుల్‌ ఉద్యోగుల్లోనూ అసంతృప్తి నెల‌కొంది. మే నెలలో కంపెనీ సీఈవో సుందర్‌పిచాయ్‌ 'హైబ్రిడ్‌ వర్క్‌ ఎన్విరాన్‌మెంట్‌'ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం.. సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి 60 శాతం ఉద్యోగులు ఆఫీస్‌లకు రావాలని, మరో 20 శాతం మంది రిమోట్‌ వర్క్‌, ఇంకో 20 శాతం మంది రీ లోకేట్‌ కావాలని పిచాయ్‌ పిలుపు నిచ్చారు. ఇక లొకేషన్‌ టూల్‌ ఆధారంగా జీతాలు ఉంటాయని కూడా ప్రకటించాడు. ఈ దశలో గందరగోళానికి గురవుతున్న ఉద్యోగులు.. ఆఫీస్‌లకు రాలేమని చెబుతున్నారు. అంతేకాదు ఈ మెయిల్స్‌ ద్వారా తమ ఫ్రస్టేషన్‌ను వెల్లగక్కుతున్నట్లు తెలుస్తోంది. మ‌రీ ఉద్యోగుల ఆఫీసుల‌కు రావాల‌నే దానిపై గూగుల్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి మ‌రీ.

యాపిల్‌ సీఈవో కూడా.. సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి వారంలో మూడు రోజులు ఆఫీస్‌కు రావాలని ఉద్యోగులకు సూచించారు. అయితే తాము ఆఫీస్‌లకు రాలేమని, వర్క్‌ ఫ్రమ్‌ హోం కొనసాగించాలని కొందరు ఎంప్లాయిస్‌ విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో ఎక్కువ రిక్వెస్ట్‌లు వస్తుండడంతో యాపిల్‌ కుదరదని తేల్చి చెప్పింది. దీంతో ఉద్యోగులు తాము రాలేమ‌ని.. కావాలంటే రాజీనామా చేస్తామ‌ని లేఖ‌లు రాయ‌డం మొద‌లు పెట్టారు. మరోవైపు కిందటి నెలలో యాపిల్‌ నిర్వహించిన ఓ సర్వేలో 90 శాతం ఉద్యోగులు తాము తమకు వీలున్న రీతిలోనే పనులు చేస్తామని వెల్లడించడం విశేషం. ఆఫీసుకు రావాల‌ని బ‌ల‌వంతం చేస్తే.. కొంద‌రు ఉద్యోగులు కోర్టుకు వెళ్లే ఆలోచ‌న‌లో కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Next Story