చోక్సీ పారిపోయే అవకాశమే లేదన్న అంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌనీ
Antigua seeks interpol help to trace mehul choksi.వజ్రాల వ్యాపారి చోక్సీ పారిపోయినట్టు వస్తున్న వార్తలను అంటిగ్వా దేశ
By తోట వంశీ కుమార్
వజ్రాల వ్యాపారి చోక్సీ పారిపోయినట్టు వస్తున్న వార్తలను అంటిగ్వా దేశ ప్రధాని గాస్టన్ బ్రౌనీ ఖండించారు. చోక్సీ దేశం విడిచి పారిపోయినట్టు వస్తున్న వార్తలు నిజం కాదని కొట్టిపడేశారు. ఆదివారం సాయంత్రం డిన్నర్ కోసం ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన చోక్సీ ఆ తర్వాత మాయమయ్యాడు. అప్పటి నుంచి అతడి కోసం గాలిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో అంటిగ్వా ప్రభుత్వం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించింది.
తమ దేశంలో విమాన సర్వీసుల నిలిచిపోయాయని, అందుకే విమానం ద్వారా పారిపోయే అవకాశం లేదని, ఇక సముద్ర మార్గం ద్వారా వెళ్లి ఉంటే ఆ విషయం తమకు ఎలా అయినా తెలిసి ఉండేదని ప్రధాని గాస్టన్ బ్రౌనీ అన్నారు. చోక్సీ పరారీ విషయమై పార్లమెంటులో మాట్లాడిన ప్రధాని బ్రౌని చోక్సీ ఇక్కడే ఉంటారని భావిస్తున్నామని, అతని ఆచూకీ కోసం గాలిస్తున్నామన్నారు.
గతంలో చోక్సీని అప్పగించమని కోరినప్పుడు అతనిని తమ దేశానికి పెట్టుబడుల కోసం ఆహ్వానించాం అని చెప్పిన బ్రౌని ఇప్పుడు మాట మార్చారు. ఒకప్పుడు ఎవరికీ తెలియనివ్వకుండా అడగగానే చొక్సీ కి ఆంటిగ్వా పౌరసత్వం ఇచ్చిన బ్రౌని ఇప్పుడు చోక్సీ తమ దేశానికి అప్రదిష్ట తెచ్చాడని, అతడిని తమ దేశం నుంచి వెళ్ళగొట్టాలనే అనుకున్నామన్నారు. అతడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందని, ఇండియాకు అతడిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్పగిస్తామంటున్నారు. క్యూబాకు వెళ్లి ఉంటాడని వార్తలు వస్తున్నాయని, కానీ ఇక్కడి నుంచి ఆ దేశానికి విమానాలేవీ లేవని ఆయన తెలిపారు.
చోక్సీ కేసుకు సంబంధించి తమ దేశ అధికారులు భారత అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు సాగిస్తున్నారని, అతడి ఆచూకీ తెలియగానే వెల్లడిస్తారని ఆయన చెప్పారు.అతడిని అప్పగించే విషయంలో పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. పనిలో పనిగా ఇండియాను గొప్ప దేశం అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ తమకు మంచి మిత్రుడని, ఇండియానుంచి 5 లక్షల డోసుల వ్యాక్సిన్ తమ దేశానికి అందిందని గుర్తు చేసుకున్నారు.