లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు.. 250 మంది అరెస్ట్..!
Anti lockdown protests More than 250 people arrested in Australia.కరోనా మహమ్మారి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది.
By తోట వంశీ కుమార్
కరోనా మహమ్మారి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈ మహమ్మారి కారణంగా సరదాగా బయటకు కూడా వెళ్లలేకున్నాం. ఇక పెళ్లిళ్లు, పండగులు కూడా నిబంధనల మధ్య చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పటికి ఈ మహమ్మారి నుంచి బయటపడుతామో తెలీదు కానీ.. ఈ ఆంక్షల మధ్య జీవించడం చాలా కష్టంగా ఉంది. ఇక కేసులు పెరుగుతుండడంతో చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌లు విధిస్తున్నారు. ఈ లాక్‌డౌన్ లను నిరసిస్తూ శనివారం ఆస్ట్రేలియా దేశంలో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనకు దిగారు. మెల్‌బోర్న్‌లో చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పలు చోట్ల ఘర్షణలు తలెత్తాయి. ఏడుగురు పోలీసు అధికారులు గాయపడ్డారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న దాదాపు 250 మందిని అధికారులు అరెస్టు చేశారు.
సిడ్నీలో రెండు నెలలుగా లాక్‌డౌన్ కొనసాగుతుండగా, మెల్‌బోర్న్, రాజధాని కాన్‌బెర్రాలలో ఈ నెలలో లాక్‌డౌన్ విధించారు. చాలా మంది ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే.. ఈ లాక్‌డౌన్ల కారణంగా మళ్లీ ఇబ్బందులు మొదలు కావడంతో ప్రజలు వీటికి వ్యతిరేకంగా గళమెత్తారు. తక్షణం లాక్‌డౌన్‌లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకోగా.. మెల్‌బోర్న్‌లో ఆందోళన హింసాత్మకంగా మారింది. దీంతో250 మందిని అధికారులు అరెస్టు చేశారు. అయితే... వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఈ చర్యలు అవసరం అని అధికారులు అంటున్నారు.
లాక్‌డౌన్ పొడిగింపు..
అంతకముందు.. కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రస్తుతం అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ను వచ్చే నెలాఖరు వరకు పొడగిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గురువారం నాడు 747 కొత్త కరోనా రోగులు నమోదయ్యాయి. శుక్రవారం కూడా 707 కేసుల రావడంతో మొత్తం కేసుల సంఖ్య 43,119 కి చేరుకున్నాయి. 978 మంది చనిపోయినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 19 నెలల అనంతరం ఇంత పెద్ద సంఖ్యలో కేసులు రావడంతో ప్రజలను అప్రమత్తం చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా దక్షిణ వేల్స్ ప్రాంతంలో ఎక్కువ కేసులు వస్తుండటంతో.. ప్రభుత్వం అక్కడ ప్రత్యేక దృష్టిని సారించింది. కొన్ని నగరాల్లో రాత్రి కర్ఫ్యూ కూడా విధించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే సమయాల్లో విధిగా మాస్కులు ధరించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది