బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య
బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. తాజాగా మరో హిందూ వ్యక్తి హత్యకు గురయ్యాడు.
By - Medi Samrat |
బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. తాజాగా మరో హిందూ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మైమెన్‌సింగ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇక్కడ నివాసం ఉంటున్న బ్రిజేంద్ర బిస్వాస్‌ను కాల్చి చంపారు. బ్రిజేంద్ర బిస్వాస్ బంగ్లాదేశ్ గ్రామీణ పారామిలిటరీ దళంలో సభ్యుడు. కొద్ది రోజుల క్రితం మైమెన్‌సింగ్ జిల్లాలోనే దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని కొట్టి చంపి, ఆపై చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేశారు.
బంగ్లాదేశ్ మీడియా ప్రకారం.. సుల్తానా స్వెటర్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీ భాలుకా ఉపజిల్లాలోని మెహ్రాబారి ప్రాంతంలో ఉంది. ఫ్యాక్టరీ భద్రత కోసం 20 మంది అన్సార్‌లను నియమించారు. అందులో బ్రిజేంద్ర బిస్వాస్ కూడా చేరారు. సోమవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో బ్రిజేంద్ర బిస్వాస్ తన భాగస్వామి నోమన్ మియాన్‌తో కలిసి కూర్చున్నప్పుడు, నోమన్ తన తుపాకీతో అతనిపై కాల్పులు జరిపాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. లబీబ్ గ్రూప్ ఇన్‌చార్జి అన్సార్ సభ్యుడు ఎపిసి మహ్మద్ అజహర్ అలీ మాట్లాడుతూ.. సంఘటన సమయంలో ఇద్దరి మధ్య ఎటువంటి వివాదం లేదని చెప్పారు. అందరూ గదిలోనే కూర్చున్నారని చెప్పారు.అకస్మాత్తుగా నోమన్ తన తుపాకీని బ్రిజేంద్ర తొడపైకి గురిపెట్టి, కాల్చివేస్తానని అరిచాడు. దీంతో నేరుగా ట్రిగ్గర్‌ను నొక్కి అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడు నోమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.