అమెరికా అధ్యక్ష రేసు నుంచి బైడెన్ ఔట్..బరిలోకి కమలా హారిస్!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా సంచలన ప్రకటన చేశారు.

By Srikanth Gundamalla  Published on  22 July 2024 6:55 AM IST
America, president joe biden,   election race,

అమెరికా అధ్యక్ష రేసు నుంచి బైడెన్ ఔట్..బరిలోకి కమలా హారిస్!

అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మరాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి డెమోక్రాటిక్ పార్టీ నుంచి పోటీ చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బైడెన్‌పై సొంత పార్టీ నుంచే ఒత్తిడి వచ్చింది. మరోవైపు ట్రంప్‌ ముందు నిలబడలేరంటూ విమర్శలు వచ్చాయి. డిబేట్‌లో తడబడటం.. మతిమరుపు, వయసు ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని బైడెన్‌ను రేసు నుంచి తప్పుకోవాలని పార్టీ నాయకులు ఒత్తిడి చేశారు. ఇక కరోనా పాజిటివ్‌తో ఐసోలేషన్‌కు వెళ్లిన అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్ష బరి నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు లేఖను విడుదల చేశారు. దేశ ప్రయోజనాల కోసమే తాను పోటీ నుంచి తప్పుకుంటున్నానని పేర్కొన్నారు. పార్టీ సీనియర్ సభ్యులను గౌరవిస్తున్నట్లు చెప్పారు జో బైడెన్.

డెమోక్రాట్ పార్టీ శ్రేణులను ఉద్దేశిస్తూ బైడెన్ మాట్లాడారు. నామినేషన్‌ను ఆమోదించకుండా పరిపాలనపైన దృష్టి పెట్టాలనుకుంటున్నానని బైడెన్ స్పష్టం చేశారు. 2020లో తాను అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించగానే మొదటగా కమలా హారీస్‌ను ఉపాధ్యక్షురాలిగా నియమించానని చెప్పారు. ఈ మూడున్నరేళ్ల పాలనలో ఆమె తనకు ఎంతగానో సహకరించారని బైడెన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తన వారసురాలిగా కమలా హారిస్‌ను ఆమోదిస్తున్నాంటూ బైడెన్ పేర్కొన్నారు. కమలా హారీస్‌కు తాను పూర్తిస్థాయిలో మద్దతిస్తానని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా ట్రంప్‌ను ఓడిద్దామంటూ బైడెన్ పిలుపునిచ్చారు. ఇక తాను ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు బైడెన్ ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా సేవ చేయడం తన జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. మూడున్నరేళ్లలో చక్కటి పురోగతి సాధించామని, నేడు అమెరికా ప్రపంచంలోనే శక్తిమంతమైన ఆర్థిక శక్తిగా ఉందని అన్నారు.

ఇంతకాలం అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకునేది లేదని బైడెన్ చెప్పుకొచ్చారు. కానీ.. పార్టీలో సొంత నేతల నుంచి ఒత్తిడి రావడంతో ఆయన వెనక్కి తగ్గారు. వయసు మీదపడటం.. తికమకకు గురవడం, ట్రంప్‌పై కాల్పుల తర్వాత బైడెన్‌పై ఆదరణ తగ్గిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల రేసు నుంచి జో బైడెన్ తప్పుకున్నారు.

Next Story