అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా పాజిటివ్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 18 July 2024 1:53 AM GMTఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా పాజిటివ్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంలో సంచలన ఘటనలు చోటుచేసుకున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆయన గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా..తాజాగా మరోసారి తాను అధ్యక్ష బరిలో నిలబడతానని చెబుతున్న అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్ కరోనా బారిన పడ్డారు. ఈమేరకు వైట్‌హౌస్ ఒక ప్రకటనను విడుదల చేసింది. అధ్యక్షుడు స్వల్ప దగ్గు, జలుబు, సాధారణ అనారోగ్యంతో బాధపడుతున్నారని వెల్లడించింది.
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు బైడెన్ డెలావేర్‌లోని సముద్రం తీరంలో ఉన్న ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొంది. కోవిడ్ మందులు తీసుకుంటున్నారని వెల్లడించింది. అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా లాస్ వెగాస్‌లో ప్రచారంలో ఉన్న బైడెన్‌కు కోవిడ్ సోకిందని వెల్లడించారు అధికారులు. టెస్టుల్లో పాజిటివ్ అని తేలడంతో వెంటనే ఆయన ఇంట్లో ఐసోలేషన్‌కు వెళ్లిపోయారని ప్రకటించారు. కాగా.. జోబైడెన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు అధికారులు చెప్పారు.
కాగా.. మంగళవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.తనకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తితే అధ్యక్ష్య బరి నుంచి వైదొలగేందుకు ఆలోచన చేస్తానన్నారు. అలా ప్రకటన చేసిన కొద్ది గంటలకే ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడం గమనార్హం. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తారని పలు నివేదికలు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో జోబైడెన్ అనారోగ్యంతో ఉంటే పోటీ నుంచి తప్పుకుంటానని వ్యాఖ్యలు చేయడం.. ఆ తర్వాత కోవిడ్ పాజిటివ్ ప్రకటన ఆసక్తిని రేపుతున్నాయి.