జిల్‌ బైడెన్‌కు కోవిడ్ పాజిటివ్, జీ20 సదస్సుకు బైడెన్ వస్తారా?

మెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సతీమణి, ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌కు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది.

By Srikanth Gundamalla  Published on  5 Sep 2023 5:22 AM GMT
America, President Biden, wife, Covid positive,

 జిల్‌ బైడెన్‌కు కోవిడ్ పాజిటివ్, జీ20 సదస్సుకు బైడెన్ వస్తారా?

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సతీమణి, ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌కు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. ఆమెకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అమెరికా వైట్‌ హౌజ్‌ వెల్లడించింది. అయితే.. జిల్‌ బైడెన్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు ప్రకటనలో తెలిపింది. కోవిడ్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నట్లు వివరించింది. కాగా.. జిల్‌ బైడెన్ ప్రస్తుతం డెలావెర్‌లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు వైట్ హౌస్ అధికారులు తెలిపారు.

ఇక జిల్‌ బైడెన్‌కు కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలగానే.. అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు వైట్ హౌజ్ తెలిపింది. అయితే.. కోవిడ్‌ టెస్టులో అధ్యక్షుడు బైడెన్‌కు నెగెటివ్‌గా వచ్చిందని వైట్‌హౌజ్ మీడియా కార్యదర్శి జీన్‌ పెర్రీ వెల్లడించారు. ఇక అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్య పరిస్థితిని కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు కోవిడ్ టెస్టు నిర్వహించి.. పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.

కాగా.. గత శనివారం బైడెన్ దంపతులు ఫ్లోరిడాలోని హరికేన్‌ ఐడాలియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తర్వాత ఇద్దరూ డెలావెర్‌లోని బీచ్‌ హౌస్‌కు వెళ్లారు. అక్కడి నుంచి బైడెన్ ఫిలడెల్పియాలోని ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వైట్‌హౌజ్‌కు చేరుకున్నారు. జిల్ బైడెన్‌ మాత్రం డెలావెర్‌లోనే ఉండిపోయారు. అక్కడే ఆమె స్వల్ప అనారోగ్యానికి గురవడంతో పరీక్షలు చేయగా కొవిడ్ పాజిటివ్‌గా తేలింది.

భారత్‌ అధ్యక్షతన ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 10వ తేదీల్లో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరగనుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా ఈ సదస్సుకు హాజరుకావాల్సి ఉంది. మరి ప్రస్తుతం ఆయన భార్యకు కోవిడ్‌ పాజిటివ్‌ రావడం, ఆయనకు కూడా నిరంతరం కోవిడ్‌ టెస్టులు నిర్వహిస్తుండటంతో భారత్‌కు వస్తారా లేదా అన్నదానిపై సందిగద్ధత నెలకొంది. మరోవైపు జీ20 సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాలేరని వైట్‌హౌజ్ కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు. దాంతో.. ఆయన కచ్చితంగా వస్తారంటూ పలువురు అధికారులు చెబుతున్నారు.

Next Story