భద్రతా వైఫల్యం.. అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్‌ని ఢీకొట్టిన కారు

భద్రతా వైఫల్యం కారణంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది.

By Srikanth Gundamalla  Published on  18 Dec 2023 4:57 AM GMT
america president, biden, convoy, accident,

 భద్రతా వైఫల్యం.. అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్‌ని ఢీకొట్టిన కారు

అమెరికాలో భదత్రా వైఫల్యం వెలుగు చూసింది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడికి భద్రత ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే.. భద్రతా వైఫల్యం కారణంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. ఆయన కాన్వాయ్‌లో భాగమైన ఎస్‌యూవీని ఓ కారు ఢీకొట్టింది. ఈ సంఘటన అధ్యక్షుడు బైడెన్, ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ డెలావర్‌లోని తమ పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లి తిరిగి వస్తుందగా ఈ ప్రమాదం సంభవించింది.

అధ్యక్షుడికి భద్రత వైఫల్యం సంఘటన ఆ దేశంలో కలకలం రేపింది. అమెరికా కాలమానం ప్రకారం ఈ సంఘటన ఆదివారం రాత్రి డెలావర్‌లో చోటుచేసుకుంది. ఈ మేరకు వైట్‌ హౌస్‌ ఈ ప్రమాదం గురించి వివరాలను తెలిపింది. అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్‌ ఆదివారం రాత్రి డెలావర్‌లోని తమ పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డిన్నర్‌ చేశారు. డిన్నర్ ముగించుకుని బైడెన్ దంపతులు ఆఫీసు బయట ఉన్న కాన్వాయ్‌ వద్దకు వస్తుండగా.. ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. ప్రెసిడెంట్‌ కాన్వాయ్‌లోని యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ వాహనాన్ని ప్రయివేట్‌ కారు బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత మరో వాహనంపైకి దూసుకెళ్లినంత పని చేసింది.

ప్రయివేట్‌ కారు కాన్వాయ్‌ని ఢీకొట్టిన సమయంలో జిల్ బైడెన్ ప్రెసిడెంట్‌ వెహికిల్‌లో కూర్చొని ఉన్నారు. జో బైడెన్ వాహనానికి అతి సమీపంలో ఉన్నారు. బైడెన్‌ తన కారుకి 130 అడుగుల దూరంలో ఉండగానే ఆ కారు వచ్చి కాన్వాయ్‌ని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం తర్వాత క్షణాల్లోనే అప్రమత్తం అయ్యిన భద్రతా సిబ్బంది.. వెంటనే అధ్యక్షుడు బైడెన్‌ను ఆయన వాహనంలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను చుట్టుముట్టిన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తసీఉకున్నారు. ఆందోళనకు గురిచేసిన ఈ సంఘటన తర్వాత బైడెన్ దంపతులను అధికారులు వైట్‌హౌస్‌కు తరలించారు. అయితే.. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదనీ.. అధ్యక్షుడు బైడెన్ ఆయన సతీమణి క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.


Next Story