అమెరికాలో హెలికాప్టర్‌లో దోమల తరలింపు.. ఎందుకో తెలుసా?

అమెరికాలో హవాయి దీవులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న 33 రకాల జాతుల పక్షులు అంతరించిపోయినట్లు స్థానిక ప్రభుత్వం గుర్తించింది.

By Srikanth Gundamalla  Published on  23 Jun 2024 3:00 AM GMT
america, mosquito, helicopter, hawaii,

అమెరికాలో హెలికాప్టర్‌లో దోమల తరలింపు.. ఎందుకో తెలుసా?

అమెరికాలో హవాయి దీవులు ఉన్నాయి. కొద్దికాలంగా ఇక్కడ ఉన్న 33 రకాల జాతుల పక్షులు అంతరించిపోయినట్లు స్థానిక ప్రభుత్వం గుర్తించింది. మరో 17 రకాల జాతుల పక్షులు కూడా కనపడకుండా పోయే ప్రమాదం ఉందని గుర్తించారు. 2018లో ఇక్కడ అకికికి అనే పక్షుల సంఖ్య 450 ఉండగా.. 2023 ఏకంగా వాటి సంఖ్య ఐదుకి పడిపోయిందట. ఇప్పుడిది ఒకే ఒక్కటి ఉండొచ్చనే అంచనా వేస్తున్నారు. అయితే.. మరో ఏడాది లోపు 17 రకాల జాతుల పక్షులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని తేలడంతో.. అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. పర్యావరణవేత్తల సూచనలతో పక్షులను కాపాడేందుకు అత్యవసరంగా రంగంలోకి దిగారు.

హవాయిలో ఉన్న అరుదైన కొన్ని జాతి పక్షులు మలేరియా ముప్పును ఎదుర్కొంటున్నాయని గుర్తించారు. ఈ వ్యాధి సోకే దోమ కుడితే 90 శాతం చనిపోయే పక్షులు ప్రమాదాలు ఉన్నాయి. మలేరియాను ఎదుర్కొనే నిరోధక శక్తి కొన్ని అరుదైన జాతుల పక్షుల్లో లేక మృత్యువాత పడుతున్నాయి. దాంతో.. మలేరియాను వ్యాప్తి చేస్తున్న దోమలను నిలువరించే పనిలో పడ్డారు అధికారులు. ఇందుకోసం వోల్బాకియా అనే బ్యాక్టీరియాతో ఉన్న మగ దోమలను హెలికాప్టర్‌ ద్వారా తీసుకొచ్చి హవాయి దీవుల్లో వదులుతున్నారు. ప్రతి వారం ఒక హెలికాప్టర్‌ ద్వారా రెండున్నర లక్షల చొప్పున దోమలను విడిచి వెళ్తోందట. ఇలా ఇప్పటి వరకు కోటికి పైగా దోమలను హవాయి దీవుల్లో వదిలారని తెలుస్తోంది.

ఈ వోల్బాకియా అనే బ్యాక్టీరియాతో ఉన్న మగ దోమలతో కలిసి ఆడ దోమలు గుడ్లు పొదగవు. ఇలా క్రమంగా చేయడం వల్ల దోమల సంఖ్యను తగ్గించొచ్చని.. తద్వారా మలేరియాను వ్యాప్తి చేస్తున్న దోమలు కూడా అంతరిస్తాయని అధికారులు చెబుతున్నారు. తద్వారా అరుదైన జాతి పక్షులను కాపాడుకోవచ్చని వివరిస్తున్నారు. అమెరికా నేషనల్‌ పార్క్‌ సర్వీసెస్‌ సహాయంతో హవాయి ప్రభుత్వం ఈ తరహా చర్యలను కొనసాగిస్తోంది.

Next Story